ఆశా వర్కర్లపై ఉక్కుపాదం
– చలో అసెంబ్లీపై నిర్భంధం
హైదరాబాద్, అక్టోబర్ 9 జనంసాక్షి):
ఆశా వర్కర్ల ఛలో హైదరాబాద్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ వస్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు ఆందోళన మరింత ఉధృతం చేశారు. నెల రోజులుగా ఎక్కడికక్కడ ఆందోళనలు తెలిపినా కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో శుక్రవారం ఛలో హైదరాబాద్‌కు పిలుపు ఇచ్చారు. తెలంగాణ నలుమూలల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తరలి వచ్చారు. తమ సమస్యలు పరిష్కరించ మంటూ తెలంగాణలోని ఆశా వర్కర్లు అసెంబ్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. పోలీసులు మాత్రం నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేసారు. నగరంలోని ఆల్వాల్, కవాడీగూడ ప్రాంతంల్లో ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సీఎం డౌన్ డైన్ అంటూ వారు నినాదాలు చేశారు. ఇందిరా పార్క్ వద్దకు వచ్చిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేసి ఘోషామహల్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం పోరాడి…మన భవిష్యత్తులను మనమే బాగుచేసుకుందమని కేసీఆర్ చెప్పడంతో తెలంగాణ కోసం పోరాటం చేశామని అన్నారు. ఇప్పుడు తమకు కనీస వేతనం రూ. 15 వేలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతున్నామని అన్నారు. ఆశా వర్కర్లు అంటే ప్రభుత్వానికి చిన్నచూపుగా ఉందని… కేసీఆర్‌కు మేము ఆడబిడ్డలం కాదా అని వారు ప్రశ్నించారు. తెలంగాణ వస్తే రాష్ట్రంలో ధర్నాలు, ఆందోళనలు, ఉద్యమాలు ఉండవని అందరూ సుఖసంతోషాలతో ఉంటామని ఆనాడు కేసీఆర్ అన్న మాటలను వారు గుర్తు చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేస్తున్న ఆశా వర్కర్లపై కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హైదరాబాద్‌కు వస్తున్న ఆశావర్కర్లను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. పోలీసుల తీరుపై వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రజాకార్ల మాదిరి వ్యహరిస్తున్నారని వరంగల్ జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి చుక్కయ్య విమర్శించారు. ఆయన వరంగల్ లో మాట్లాడుతూ…తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 40 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని… ఈ నేపథ్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలు దేరిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారని మండి పడ్డారు. అంతే కాక ఆశా కార్యకర్తల ఇళ్ల విూద పడి ఆశా వర్కర్ల భర్తలను, పిల్లలను కూడా చితకొట్టి అరెస్టు చేస్తున్నారని… ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అరెస్టు చేసిన వారిని ఓ ఫంక్షన్ హాల్ నిర్బంధించారని… కనీసం వారికి తినడానికి తిండి కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులకు నిరసనగా శనివారం జిల్లా వ్యాప్తంగా బంద్, ఆందోళనలు చేపడతామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, జిల్లా అధ్యక్షుడు పర్వతాలు సహా పలువురు ముఖ్యనేతలను పోలీసులు ముందుగా అరెస్టు చేశారు. పార్టీ కార్యాలయంలో ఉన్న సీపీఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులు అప్రజాస్వామికమని చుక్కా రాములు విమర్శించారు ఛలో హైదరాబాద్‌కు బయలుదేరిన ఆశా వర్క్లర్లను ఖమ్మం జిల్లా భద్రాచలం పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ సీఐటీయూ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు మరికొంతమందిని అరెస్టు చేశారు. సమస్యలు పరిష్కరించలేని కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మధిరలో ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. చలో హైదరాబాద్‌కు బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు-ఆశా వర్కర్ల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట జరిగింది.
ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఆశా కార్యకర్తల భారీ ధర్నా
సర్కార్ దమనకాండను నిరసిస్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆశా కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కనీస వేతనాలు అమలు చేయాలని, ఏఎన్ఎంలుగా గర్తించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్, సుందరయ్యపార్క్, ఇందిరాపార్క్ వద్ద ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. చలో అసెంబ్లీకి తరలి వస్తున్న ఆశా కార్యర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. తమ సమస్యలు పరిష్కరించమంటూ తెలంగాణలోని ఆశా వర్కర్లు అసెంబ్లీ ముట్టడికి సిద్ధమయితే అడ్డుకోవడం దారుణమన్నారు. పోలీసులు మాత్రం నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. ఇందిరా పార్క్ వద్దకు వచ్చిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేసి ఘోషామహల్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం పోరాడి…మన భవిష్యత్తులను మనమే బాగుచేసుకుందమని కేసీఆర్ చెప్పడంతో తెలంగాణ కోసం పోరాటం చేశామని అన్నారు. ఇప్పుడు తమకు కనీస వేతనం రూ. 15 వేలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతున్నామని అన్నారు. ఆశా వర్కర్లు అంటే ప్రభుత్వానికి చిన్నచూపుగా ఉందని… కేసీఆర్‌కు మేము ఆడబిడ్డలం కాదా అని వారు ప్రశ్నించారు. నగరంలోని మగ్ధుం భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివస్తూ చలో అసెంబ్లీకి బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 40 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో వారు మండిపడుతూ శుక్రవారం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో దీనికి అనుమతి లేదని చెబుతూ ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. తమ ఉద్యమాన్ని అణచివేసి… అరెస్టులు చేసినా ఆందోళన ఆగదని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు. ఎక్కడిక్కడ పోలీసుల నిర్బంధకాండ కొనసాగినా ఆశాలు వెనుతిరగలేదు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్, ఎస్వీకే నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎస్వీకే, ఎంబీ భవన్ దగ్గర ఆశా వర్కర్ల అరెస్ట్ కొనసాగుతోంది. అటు సీఐటియు నేతలను నిన్న రాత్రి నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ తీరును ఆశా వర్కర్లు తీవ్రంగా ఖండించారు. అన్ని రకాల పనులు చేయించుకుని .. వేతనాలు అడిగితే దౌర్జన్యం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.