ఆశ్రమ విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

ఖమ్మం, నవంబర్‌ 8 : జిల్లాలోని 29 ఏజెన్సీ మండలాల్లో ఐసిడిఎ అదీనంలో కొనసాగుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం, అధికారులు విస్మరించారని తెలంగాణ లంబాడ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రతాప్‌సింగ్‌ ఆరోపించారు. ఆశ్రమ పాఠశాలలో కనీసం తాగునీరు, మరుగుదొడ్లు కూడా లేక  విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెను ప్రకారం విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించడంలేదని అన్నారు. ఇల్లందులోని తుద్దిమల్ల ఆశ్రమ పాఠశాలకు వారానికి ఒక్కరోజు నీటి సరఫరా అవుతుందన్నారు. ఆశ్రమ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జిలు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.