ఆసక్తికరంగా ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక

– అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదన్‌ ఎంపిక
– ముగ్గురు అభ్యర్థుల నడుమ ప్రధాన పోటీ
చెన్నై, నవంబర్‌30(జ‌నంసాక్షి) : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌లో ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నిక ¬రా¬రీగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదనన్‌ బరిలోకి దిగుతుండగా డీఎంకే నుంచి మరుదు గణెళిశ్‌, శశికళ వర్గం నుంచి టీటీవీ దినకరన్‌ పోటీ చేస్తున్నారు. జయలలిత నియోజకవర్గంలో గెలిచి.. ఆమె వారసులం తామేనని నిరూపించుకోవాలని ఇటు అధికా అన్నాడీఎంకే, అటు శశికళ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డీఎంకే కూడా ఈ ఎన్నికలో గట్టి పోటీ ఇచ్చి.. ప్రత్యర్థులకు షాక్‌ ఇవ్వాలని భావిస్తోంది. డిసెంబర్‌ 21న ఈ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 24న ఫలితాలు వెల్లడించనున్నారు.
అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదన్‌ ఏకగ్రీవ ఎంపిక..
తమిళనాడులోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలకు అధికార అన్నాడీఎంకే అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ ప్రిసీడియం ఛైర్మన్‌, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం నమ్మకస్తుడు ఈ. మధుసూదన్‌ను ఉపఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. అభ్యర్థి విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని అన్నాడీఎంకే అధిష్ఠానం కోరింది. దీంతో మధుసూదన్‌ సహా మరో 19 మంది మంగళవారం తమ దరఖాస్తులను సమర్పించారు. వీరిలో మధుసూదన్‌ను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.