ఆసరా ఫింఛన్ల మంజూరీలో తెలంగాణా రికార్డు

రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణాలోనూ ఇచ్చింది సాలీనా 800 కోట్లే
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇస్తున్నది 12,000 కోట్లు
25 వేల కోట్ల ఋణమాఫీ చేసింది ఒక్క తెలంగాణాలోనే
కొత్తగా పది లక్షల మందికి ఫించన్లు
_-మంత్రి జగదీష్ రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
వృద్దులకు,దివ్యాoగులలతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, గీతా, నేత,బీడీ కార్మికులకు ఫింఛన్ల మంజూరీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన నూతన ఫింఛన్లను నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని నల్లగొండ మండలంలోని లబ్దిదారులకునూతన ఫించన్ కార్డులను సోమవారం ఆయన అందజేశారు.నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు,నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు, రవీంద్రనాయక్,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా ప్రాంతంలోనూ రాష్ట్రం ఏర్పాటుకు ముందు సాలీనా 800 కోట్లు ఇస్తుండగా రాష్ట్రం ఆవిర్భావం తరువాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఫింఛన్ల పేరుతో సాలీనా 12,000 కోట్లు చెల్లిస్తుందన్నారు.వృద్దులకు,వితంతువులతో పాటు ఒంటరి మహిళలకు 2,016 రూపాయలు, దివ్వాంగులకు 3,016 రూపాయలు ఫించన్ ఇస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఏకైక రాష్ట్రం తెలంగాణా మాత్రమే నన్నారు.అందుకే తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రం కిందా మీద పడుతుందని ఆయన దుయ్యబట్టారు. బ్యాంకు ల నుండి రుణాలు మంజూరు కాకుండా అడ్డుకోవడం, కేంద్రం ఇవ్వాల్సిన నిధులను ఇవ్వక పోవడం,రాష్ట్రం నుండి ముక్కు పిండి వసూలు చేసిన పన్నులు తిరిగి రాష్ట్రానికి అందించకుండా మొకలడ్డుతున్నారనిఆయన మండిపడ్డారు. అయినా వెనక్కి తగ్గకుండా కొత్తగా మంజూరు అయిన 10 లక్షల ఫించన్లను కలుపుకుని మొత్తం తెలంగాణా రాష్ట్రంలో46 లక్షల మంది లబ్దిదారులకు ఫించన్లు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. లబ్దిదారులకు ఫించన్ మొత్తం ఎటువంటి పైరవీలకు ఆస్కారం లేకుంటా జమ అవుతున్నాయన్నారు.
అంతే గాకుండా ఋణమాఫీ పేరుతో 25 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిన చరిత్ర తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.అన్నింటికీ మించి తెలంగాణా ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.



