ఆసియా క్రీడలకు దీపిక డౌటే!

– డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న దీపిక
– 22 నుంచి ప్రారంభం కానున్న ఆర్చరీ పోటీలు
న్యూఢిల్లీ, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : ఆసియా గేమ్స్‌లో భారత అగశ్రేణి ఆర్చరీ క్రీడాకారిణి దీపిక కుమారి పొల్గొనడం అనుమానంగా మారింది. దీపిక ప్రస్తుతం డెంగ్యూ జ్వరంతో బాధపడుతోంది. దీంతో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈనేపథ్యంలో ఆసియా క్రీడల్లో పాల్గొనడం దీపకకు సాధ్యం కానట్లు తెలుస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం దీపిక బుధవారం జట్టు సభ్యులతో కలిసి జకార్తా బయలుదేరాలి. కానీ, జ్వరం కారణంగా ఆమె వెళ్లలేకపోయింది. ఈనెల 18నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేషియాలో ఆసియా గేమ్స్‌ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు షెడ్యూల్‌ ప్రకారం అక్కడికి  బయలుదేరుతున్నారు. ఈ నెల 22 నుంచి ఆర్చరీ ఈవెంట్‌లో పోటీలు ప్రారంభంకానున్నాయి. ‘గత వారం రోజుల నుంచి దీపిక డెంగ్యూతో బాధపడుతోంది. అందుకే మిగతా జట్టుతో కలిసి వెళ్లలేకపోయింది. శుక్రవారం దీపిక ఇండోనేషియా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాం. ఆమె కోలుకోవడమే తరువాయి’ అని జట్టు మేనేజ్‌మెంట్‌ సభ్యులు తెలిపారు. ఆసియా క్రీడల్లో దీపిక పతకం సాధిస్తోందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు దీపిక ఆ పోటీల్లో పాల్గొనడంపైనే అనుమానాలు నెలకొన్నాయి.దీపిక త్వరగా కోలుకుని పోటీల్లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. అనారోగ్యంతో దీపిక ఇలా పోటీలకు దూరమవ్వడం ఇదే తొలిసారి కాదు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో జ్వరం బాధపడుతూ పోటీలో పాల్గొంది. మెరుగైన ప్రదర్శన చేయలేకపోవడంతో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.