ఆసుపత్రిలో చేరాను విచారణకు రాలేను

1

– ఏసీబీకి సండ్ర లేఖ

హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి):

తాను తీవ్రమైన వెన్నునొప్పి, కాలినొప్పితో బాధపడుతున్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని ఏసీబీ ఏసీపీ మల్లారెడ్డికి తెలంగాణ టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య లేఖ రాశారు. తాను విచరాణకు సహకరిస్తానని, కావాలంటే ఆస్పత్రికి వచ్చినా విచారణకు సహకరిస్తానని అన్నారు. శుక్రవారంరోజు సాయంత్రం 5 గంటలలోపు విచారణకు రావాలని తనకు నోటీసులు పంపినట్లు తెలిసిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు. 10 రోజుల తర్వాత విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు. లేదంటే విూరే ఆస్పత్రికి వచ్చి సమాచారం సేకరించుకోవచ్చని సండ్ర లేఖలో కోరారు. ఓటుకు నోటు కేసులో 19నసాయంత్రం 5 గంటల లోగా విచారణకు హాజరుకావాలని ఏసీబీ సీఆర్పీసీ 160 సెక్షన్‌ కింద సండ్రకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంటికి నోటీస్‌ అంటించారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణకు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా ఎసిబి గుర్తించింది.  ఆయన ఈ కేసులో ఏసీబీ అదికారుల ఎదుట విచారణ నిమిత్తం హాజరుకావాల్సి ఉంది. అయితే తనకు వెన్ను నొప్పి వల్ల విచారణకు హాజరుకాలేక పోతున్నానని మధ్యాహ్నం ఏసీబీకి సమాచారం పంపించారు. ఈమేరకు ఆయన అధికారులకు ఒక లేఖ పంపించారు. డాక్టర్లు పదిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని పేర్కొన్నారు. కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని సండ్ర ప్రకటించారు. అయితే ఏసీబీ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే సండ్ర లేఖ తమకు ఇంకా అందలేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు