ఆ ఉగ్రవాది మసూద్‌ మేనల్లుడు

శ్రీనగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా.. ఓ జవాను వీరమరణం పొందారు. కాగా.. హతమైన ఉగ్రవాదుల్లో ఒకడు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ మేనల్లుడని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక విూడియా వర్గాలు ఈ వివరాలు వెల్లడించాయి. పుల్వామా ఎన్‌కౌంటర్‌లో హతమైంది మసూద్‌ మేనల్లుడు, జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ డివిజినల్‌ కమాండర్‌ తహ్లా రషీద్‌ అని విూడియా పేర్కొంది. కాగా.. రహీద్‌ మృతిని ఉగ్రవాద సంస్థ కూడా ధ్రువీకరించినట్లు తెలిపింది. హతమైన మిగతా ఇద్దరు కూడా తమ కమాండర్లేనని జైషే మహ్మద్‌ అంగీకరించింది. మరోవైపు రషీద్‌ మృతిని అటు కశ్మీర్‌ పోలీసులు కూడా ధ్రువీకరించారు. రషీద్‌ మసూద్‌ అజహార్‌ మేనల్లుడని కశ్మీర్‌ ఐజీ మునీర్‌ ఖాన్‌ తెలిపారు.

పుల్వామాలోని అగ్లర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన జవాన్లు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టారు. మరోవైపు ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను మృతిచెందగా ఓ పౌరుడు గాయపడ్డాడు. ఈ ఎన్‌కౌంటర్‌తో పాకిస్తాన్‌ అడ్డగా భారత్‌పై విషం కక్కుతున్న కరడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్‌ (జేఈఎం) చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌కు గట్టి షాక్‌ తగిలింది. జేఈఎం ఉగ్రవాది తల్హా రషీద్‌ హతమయ్యాడు. పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జేఈఎంకు కశ్మీర్‌ కమాండర్‌గా రషీద్‌ పనిచేస్తున్నట్టు గుర్తించారు. కాగా ఇదే ఎన్‌కౌంటర్‌లో అజార్‌ మేనల్లుడితో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారని జేఈఎం ప్రతినిధి ఒకరు జాతీయ విూడియాకు వెల్లడించారు. అందులో ఒకరు

జేఈఎం డివిజినల్‌ కమాండర్‌ ముహమ్మద్‌ భాయ్‌ కాగా మరొకరు ద్రుబ్గం పుల్వామా వాసి వసీమ్‌గా గుర్తించారు. పుల్వామాలోని కంది అల్గార్‌ గ్రామంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో సీఆర్‌పీఎఫ్‌, రాష్టీయ్ర రైఫిల్స్‌తో పాటు జమ్మూ కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు. కాగా ఈ ఎన్‌కౌంటర్లో దురదృష్ట వశాత్తూ శ్యాం సుందర్‌ అనే ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు సైనికులు, ఓ పౌరుడికి గాయాలైనట్టు జమ్మూ కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. కాగా ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం చుట్టూ భద్రతా దళాలు ప్రస్తుతం కార్డన్‌ సెర్చ్‌ కొనసాగిస్తున్నాయి