ఆ ఖర్చు మేమే భరిస్తాం
– చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించిన కేటీఆర్
హైదరాబాద్,డిసెంబర్28(జనంసాక్షి):హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో పెద్దపేగులో వ్యాధితో బాధపడుతున్న సత్తుపల్లికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంతోష్ ను కేటీఆర్ పరామర్శించారు. సంతోష్ తనను కలుసుకోవాలనుకుంటున్న విషయం తెలుసుకున్న మంత్రి.. అతన్ని కలిసి మాట్లాడారు. కోలుకున్న తర్వాత అతని చదువుకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో పలు అభివృద్ధి పనులను మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, తలసాని ప్రారంభించారు. నెఫ్రాలజీ యూనిట్ ఆధునీకరణ, కిడ్నీ కేర్ యూనిట్, సబ్ స్టేషన్ ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం దేశంలోనే తొలిసారి ప్రభుత్వాసుపత్రిలో హార్ట్ కేర్ ట్రాన్ ప్లాంట్ నిర్వహించిన ఓంలతను పరామర్శించారు. దేశంలోనే తొలిసారి హాస్పిటల్ బేస్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. బంగారు తెలంగాణలో భాగంగా ఆరోగ్య తెలంగాణ దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖా మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని నిమ్స్ ఆసుపత్రిని మంత్రులు కే. లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ లతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ… తమిళనాడు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించేందుకు త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటించనున్నామన్నారు.
నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంజినీరింగ్ విద్యార్ధిని పరామర్శించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్ధి సంతోష్ అనారోగ్యానికి గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ నిమ్స్ కు వెళ్లి విద్యార్ధిని పరామర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… సంతోష్ చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు.నగరంలోని నిమ్స్ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రులు కే. తారకరామారావు, కె. లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈసందర్బంగా ఆసుపత్రిలోని ఆయా విభాగాలను వారు పరిశీలించారు. అలాగే వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయన్న విషయాన్ని రోగులను అడిగి తెలుసుకున్నారు.
‘ఎన్నిసార్లు ఆహ్వానించినా తెలంగాణకు రాని మోదీ’
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్నిసార్లు ఆహ్వానించినా తెలంగాణకు రాలేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి నేడు మాట్లాడుతూ.. రోజు రోజుకు టీఆర్‌ఎస్ బలం పెరుగుతున్నది. సీఎం కేసీఆర్ పట్ల ప్రజలకు విశ్వాసం పెరిగింది. హైదరాబాద్‌లో ఫీల్‌గుడ్ వాతావరణం ఉంది. 18 నెలల కాలంలో భావోద్వేగాలు లేకుండా పాలన జరుగుతుంది. ఇదే విషయం సీమాంధ్ర ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి. సర్వేల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే కాంగ్రెస్ పరిమితం అవుతది. 80 పైగా స్థానాలను టీఆర్‌ఎస్ గెలుస్తుంది. వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తరు. ప్రధాని మోదీని ఎన్నిసార్లు ఆహ్వానించినా తెలంగాణకు రాలేదు. ఏపీకి కనీసం మట్టి, నీరు ఇచ్చారు. తెలంగాణ ముఖం చూడలేదు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎవరితోనైనా కొట్లాడుతం. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ముక్కుపిండి వసూలు చేసుకుంటం. గ్రేటర్ ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తం. పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తం. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో అడగాలని ప్రజలకు చెప్తమని ఆయన పేర్కొన్నారు.