ఆ ప్రకటన మాకు ఆమోదయోగ్యం కాదు
పోరు కొనసాగుతోంది
మాజీ సైనికొద్యుగులు
న్యూఢిల్లీ,సెప్టెంబర్5(జనంసాక్షి):
ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్ పై కేంద్ర రక్షణ మంత్రి ప్రకటన తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న మాజీ సైనికుల నాయకులు స్పందించారు. నాలుగు దశాబ్ధాలుగా నలుగుతున్న సమస్యను పరిష్కరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐతే, ప్రభుత్వ ప్రకటనపై తాము పూర్తి సంతృప్తిగా లేమని చెప్పారు. ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్ అమలు వరకు మాత్రమే తాము సమ్మతిస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్లకోసారి సవిూక్షిస్తామనడం సరికాదని, రెండేళ్లకోసారి సవిూక్షించాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తాము చేసిన ఆరు డిమాండ్లలో ఒక దానికి మాత్రమే కేంద్రం ఆమోదం తెలిపిందని, మిగతా ఐదు డిమాండ్లను వదిలేసిందని రిటైర్డ్ మేజర్ జనరల్ సత్బీర్ సింగ్ వివరించారు.ఈక్వలైజేషన్ కోసం ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేయడాన్ని కూడా మాజీ సైనికులు వ్యతిరేకిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఐదుగురిలో ముగ్గురు మాజీ సైనికులు, మరొక ప్రస్తుత సైనిక అధికారి, ఇంకొకరు ప్రభుత్వం తరుపున సభ్యుడు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సభ్యులకు ఓఆర్‌ఓపీ వర్తించదన్న కేంద్ర నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు.డిమాండ్లు నేర వేరే వరకు పోరు కొనసాగుతుందన్నారు.