ఆ మంత్రులు తప్పుకోరు

5

– పార్లమెంటును సజావుగా నిర్వహిస్తాం

– మోదీ, వెంకయ్య

– నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ,జులై20(జనంసాక్షి):  పార్లమెంటు సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని… దీనికి అన్ని పార్టీలు బాధ్యత వహించాలని, మంత్రులు ఎవరు రాజీనామా చేయరని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సమావేశాల్లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి అంశాన్ని సవ్య దిశలో చర్చించి నిర్ణయానికి రావాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని మోదీ సభ్యులను కోరారు. భూసేకరణ బిల్లుపై చర్చించి ప్రస్తుత సమావేశాల్లో ఆమోదం దక్కేలా చూడాలని మోదీ చెప్పారు. వ్యాపమ్‌ స్కామ్‌, లలిత్‌ మోదీ వ్యవహారాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్న విపక్షాలను ఎదుర్కునేందుకు బీజేపీ సంపూర్ణంగా సిద్ధమైంది. అయితే కళంకిత మంత్రుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని విపక్షాలు తేల్చిచెప్పినట్లు సమాచారం. అయితే ఏ విషయంలోనూ వెనక్కి పోమని అన్ని అంశాలనుచర్చిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గతంలోనే మనకు అనేక నిబంధనలు ఉన్నాయని, వాటి ప్రకారం సభను సజావుగా నడుపుతామన్నారు. దాయడానికి ప్రభుత్వం వద్ద ఏవిూ లేదన్నారు. అన్ని అంశాలపైనా చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. ఏదైనానిబంధనల మేరకు చర్చించేందుకు అభ్యంతరం లేదన్నారు. ఇదిలావుంటే  వివాదాల్లో చిక్కుకున్న మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రాజస్థాన్‌ సీఎం వసుంధరారాజేలకు పార్లమెంటులో మద్దతు ఇచ్చేందుకు బీజేపీ నిర్ణయించింది.పార్టీ సీనియర్‌ నేతలను కలిసిన ఇద్దరు సీఎంలు తమ దగ్గరున్న సమాచారాన్నంతా వారితో పంచుకున్నారు. లలిత్‌మోదీ విసా వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ను తప్పించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఇదే అంశంపై పార్లమెంటును స్తంభిస్తామని కాంగ్రెస్‌ హెచ్చరించిన నేపథ్యంలో సమావేశాలు ఆసక్తికరంగా సాగనున్నాయి. జులై 21 నుంచి ఆగష్టు 3వ వరకు పార్లమెంటు సమావేశాలు జరుగనున్నాయి. దీంతో ఈసమావేశాలు సజావుగా సాగుతాయా లేదా అన్న సందేహంలో సోమవారం అఖిలపక్షం జరగడం విశేషం. ఇందులో ఎవరి వాదనలు వారు వినిపించినట్లు సమాచారం. ఇకపోతే సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గరాదని అధికార, ప్రతిపక్షాలు రెండూ నిర్ణయించాయి. వివాదాలను ఎదుర్కొంటున్న కేంద్రమంత్రులు, భాజపా ముఖ్యమంత్రుల రాజీనామాలకు గట్టిగా పట్టుపట్టాలని విపక్షాలన్నీ వ్యూహం సిద్ధం చేశాయి. ఇవి లేవనెత్తబోయే అంశాలపై ఎదురుదాడి చేయాలని అధికార బిజెపి కూడా సిద్దంగా ఉంది.  మంగళవారం మొదలయ్యే సమావేశాలు వాడిగావేడిగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. వివాదాస్పదుడైన లలిత్‌మోదీకి సహకరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజె రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతల వివాదంలో చిక్కుకున్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ ల్మహాన్‌ ‘వ్యాపం’ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌పై బియ్యం కుంభకోణం ఆరోపణలున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో వీరి ప్రస్తావన రానుండడంతో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌, స్మృతిఇరానీ, రవిశంకర్‌ ప్రసాద్‌, పియూష్‌ గోయల్‌, రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజె తదితరులతో అమిత్‌షా సమాలోచనలు జరిపారు. ఆత్మరక్షణలో పడిపోకుండా ఎదురుదాడి చేయడమే ఉత్తమమని నిర్ణయించారు. కాంగ్రెస్‌ నేతలు శశిథరూర్‌, జ్యోతిరాదిత్య సింధియాలకు లలిత్‌మోదీతో ఉన్న సంబంధాలను బయటపెట్టి ఎదురుదాడికి సిద్దం కావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.   పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలంటే… వివాదాలను ఎదుర్కొంటున్న సుష్మా, వసుంధర, ల్మహాన్‌లను తొలగించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ముఖ్యమైన బిల్లులకు సభలో ఆమోదం లభించాలన్నా ఇది అనివార్యమని రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ విలేకరుల సమావేశంలో తేల్చిచెప్పారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో కొత్తగా 11 బిల్లుల్ని ప్రవేశపెడతారు. రాజ్యసభలో ఉన్న 9, లోక్‌సభలో ఉన్న 4 బిల్లులపైనా చర్చిస్తారు. వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని సవరిస్తూ ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయడం, స్థానిక సంస్థలో మహిళలకు రిజర్వేషన్‌, ఉన్నత న్యాయమూర్తుల వేతనాలు, జాతీయ మహిళా కమిషన్‌ బిల్లు వంటివి సభ ముందుకు రానున్నాయి.