ఆ ముగ్గురిలో విజేత ఎవరో వీడనున్న సస్పెన్స్
గెలుపుపై వందశాతం ధీమాలో టిఆర్‌ఎస్
కరీంనగర్,మే22(జనంసాక్షి): తెరాస పార్టీ తరపున రంగంలోకి దిగిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ ఆధిక్యతతో గెలుస్తారనే భావనలో గులాబీ శ్రేణులు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు సహా సంప్రదాయ ఓటింగ్‌తో తెరాస అభ్యర్థి గెలుపు ఖాయమనేలా పార్టీ గంపెడాశలతో ఉంది. ఇక ఏ మాత్రం గెలుపు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కమలం పార్టీ మాత్రం అనూహ్యంగా క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతును కూడగట్టుకుందనే ప్రచారం పార్లమెంట్ పరిధిలో విస్తృతమైంది. ఈ పార్టీ తరపున పోటీ చేస్తున్న బండి సంజయ్‌కుమార్ గెలుపు ఖాయమనేలా పార్టీ శ్రేణులు ఉత్సాహంతో కనిపిస్తున్నారు. అంచనాలకు భిన్నంగా ఏ మేరకు విజయాన్ని ఈ పార్టీ అందుకుంటుందనేది మరికొన్ని గంటల్లోవెలువడే తీర్పులో బహిర్గతం కానుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎటూ చెప్పని తీరుగా మారింది. బలమైన పార్టీగా పేరున్న పార్టీ తరపున పొన్నం ప్రభాకర్ పోటీలో నిలిచారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రం ప్రభావాన్ని చూపేలా ఓట్లు కొల్లగొట్టనున్నారు. అయినప్పటికీ గెలుపు అవకాశాలపై హస్తం పార్టీ నేతలు కూడా ఆశల్ని ఏ మాత్రం సడలనివ్వకుండా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. మొత్తంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో గెలిచే ధీరుడెవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెరాస అభ్యర్థి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు కేటీఆర్ విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వినోద్‌కుమార్ గెలిస్తే కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారుతారనే విషయాన్ని అధినేతనే స్వయంగా వెల్లడించడంతో ఆ పార్టీ ప్రచారజోరులో దూసుకెళ్లింది. రైల్వే ప్రాజెక్టులతోపాటు కేంద్ర స్థాయి నుంచి నిధుల రాబట్టుకోవడంతో ముందుంటామని చెప్పిన తెరాస హావిూలను ఓటర్లు ఏమేరకు విశ్వసించారనేది తేలిపోనుంది. ఇక భారతీయ జనతాపార్టీ అభ్యర్థి తరపున ప్రచారంలోనూ జోరైన హావిూలు వినిపించాయి. ఐదేళ్ల మోదీ పాలనను చూసి ఓటెయ్యాలని కోరడంతోపాటు గెలిస్తే కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా నిధుల్ని తెస్తానని.. మళ్లీ మోదీ సర్కారు అధికారంలో ఉంటుందని ప్రచారం చేపట్టారు. మొత్తంగా ఈ ముగ్గురిలో విజేతలెవరో నఏటి ఫళితంలో తేలనుంది.