డొనెట్స్క్, లుహాన్స్క్ రెండు ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్: ఉక్రెయిన్ పట్ల రష్యా అవలంభిస్తున్న వైఖరిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఖండించారు. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్‌ను రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ రెండు ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ పెట్టుబడులు, వాణిజ్యంపై నిషేధం విధిస్తున్నామని వెల్లడించారు. ఈమేరకు బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేశారు.
ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తల నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రత బృందంతో బైడెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా డొనెట్క్స్, లుహాన్స్క్‌లకు స్వతంత్ర హోదా కల్పించడం ద్వారా రష్యా అంతర్జాతీయ కట్టుబాట్లను ఉల్లంఘించిందని బైడెన్ విమర్శించారు.
కాగా, రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతిస్తామని ప్రకటించింది.
ఉక్రెయిన్ పట్ల పుతిన్ చర్యను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుబట్టారు. ఉక్రెయిన్‌కు అవసరమైన మేర తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పుతిన్ చర్యలపై జర్మనీ చాన్స్‌లర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటు ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తున్నామని పుతిన్ చెప్పారు. ఈ మేరకు వేర్పాటువాద నాయకులతో ఒప్పందాలపై సంతకం చేశారు. ఆ రాష్ట్రాలకు మిలటరీ సహకారం అందిస్తామన్నారు.