ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం
ఓల్డ్ ట్రాఫోర్డ్, జులై2(జనం సాక్షి ) : ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా మంగళవారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న పర్యటనపై దృష్టి సారించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జరిగే మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో కోహ్లి సేన నెట్ ప్రాక్టీస్‌కు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ.. ఇండియన్ క్రికెట్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో ఓపెనర్ కేఎల్ రాహుల్ తన సహచర ఆటగాళ్లు తొలి టీ20కి ఏవిధంగా సన్నద్ధమవుతున్నారో క్లుప్తంగా వివరించాడు. మరోవైపు తొలి టీ20కి ఆతిథ్యమివ్వనున్న ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానానికి సంబంధించిన ఫొటోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో చోటు దక్కించుకున్న రాహుల్ 36బంతుల్లో 70 పరుగులతో రాణించాడు. గత ఇంగ్లండ్ పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శన చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటంతో తుది జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం వెల్లడించాడు.