ఇంగ్లాండ్‌ తొలి బోణీ

స్కాట్లాండ్‌పై 119 పరుగుల తేడాతో  విజయం
కైస్ట్ర్‌ చర్చ్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ):  ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాడం బోణీ కొట్టింది. న్యూజిలాండ్‌ లోని  కైస్ట్ర్‌ చర్చ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 304 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ ఇంగ్లాండ్‌ బౌలర్ల దెబ్బకు 42.2 ఓవర్లలోనే 184 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. 304 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ ఆది నుంచే దూకుడైన ఆటతో ఆకట్టుకుంది. తొలి పది ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 47 పరుగులు చేసింది. అయితే బ్యాట్స్‌మెన్లుస్కోరు బోర్డు వేగం పెంచే క్రమంగా భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. ఓపెనర్‌ కొయిట్టర్‌(71) ఇంగ్లాండ్‌ బౌలర్లను ప్రతిఘటిస్తూ ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేసినా… అతనికి మరో ఎండ్‌లో సహకారం కరవైంది. ఎంతలా అంటే ఏడుగురు బ్యాట్స్‌మెన్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. క్రాస్‌(23), హక్‌(15)ఫర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఫిన్‌ 3, అండర్సన్‌ 2, అలీ 2, వోక్స్‌ 2, రూట్‌ ఒక వికెట్‌ తీశారు. ప్రపంచకప్‌లో వరుసగా రెండు ఘోర పరాజయాలతో డీలా పడిపోయిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు మొయిన్‌ అలీ, బెల్‌లు ఫామ్‌లోకి రావడం…స్కాట్లాండ్‌పై విజయం దక్కడం కొంత ఉపశమనం కలిగించింది.  ఓపెనర్‌ అలీ ఆది నుంచే స్కాట్లాండ్‌ బౌలర్ల లయను దెబ్బతీస్తూ బౌండరీలతో చెలరేగి ఆడాడు. కేవలం 91 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అలీ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హక్‌ బౌలింగ్‌ భారీ సిక్స్‌తో శతకం పూర్తి చేసుకోవడం విశేషం. మరో ఓపెనర్‌ ఇయాన్‌ బెల్‌(54)తో కలిసి అలీ తొలి వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో జట్టు 300పైగా స్కోరు చేయగలిగింది. 30.1 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న అలీ బారింగ్టన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బాలెన్స్‌ (10), రూట్‌(1), టేలర్‌(17), బట్లర్‌(24)లు తొందరగా పెవిలియన్‌కు చేరారు. అయితే మోర్గాన్‌ (46) మాత్రం కె/-టపెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని జట్టుకు /-నరవ ప్రదమైన స్కోరును అందించాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో డేవి 4, వార్డ్‌లా ఇవాన్స్‌, హక్‌, బారింగ్టన్‌ తలో వికెట్‌ తీశారు.

.