ఇంజనీరింగ్ అడ్మీిషన్ల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్,జూన్30(జనంసాక్షి):
రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు. వచ్చే నెల (జులై) 6 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. జులై 10న వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఇస్తున్నామన్నారు. జులై 13వ తేదీన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. జులై 18న విద్యార్థులు కాలేజీల్లో చేరాలని సూచించారు. జులై 25,26 తేదీల్లో రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆగస్టు 1నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పాపిరెడ్డి వెల్లడించారు. రెండో విడత కౌన్సిలింగ్ తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జులై నెలాఖరులోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభిస్తామని పాపిరెడ్డి చెప్పారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 2015-2016 విద్యా సంవత్సరానికి 87,867 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో జేఎన్టీయూ పరిధిలో 76, 635 సీట్లు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 8,200 సీట్లు, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2, 520 సీట్లు ఉన్నాయి. ఈ మూడు యూనివర్సిటీల క్యాంపస్ కాలేజీలలో 3,032 సీట్లు ఉన్నాయి. నిబంధనల మేరకు 62,416 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. వీటిలో ప్రైవేటు కాలేజీల్లో 59,384 సీట్లు, యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలలో 3,032 సీట్లు ఉన్నాయి. యాజమాన్య కోటా 30 శాతం ప్రకారం 25,450 సీట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఎంసెట్ ద్వారా 91 వేల మంది విద్యార్థులు ర్యాంకులు సాధించగా, వారిలో 63 వేల మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. ప్రస్తుతం 87,867 సీట్లు అందుబాటులో ఉండటంతో ఎంసెట్ లో ర్యాంకులు పొందిన ప్రతి ఒక్కరికీ సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.