ఇంజనీరింగ్ కళాశాలల ప్రక్షాళన
– 220 కాలేజీలకే అనుమతి
– అందుబాటులో 76,635 సీట్లు
హైదరాబాద్,జూన్29(జనంసాక్షి):
రాష్ట్రంలోని అనుమతించిన 220 ఇంజినీరింగ్ కాలేజీల్లో 76,635 సీట్లు అందుబాటులో ఉన్నాయని జెఎన్టీయూ హైదరాబాద్ ఇన్‌ఛార్జి వీసీ శైలజారామయ్యర్ ప్రకటించారు. 62 వేల మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరైనట్టు చెప్పారు. ఈ సంవత్సరం 245 కాలేజీల నుంచి అఫిలియేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 220 కళాశాలలకు అనుమతి ఇచ్చామని ఆమె వెల్లడించారు. ప్రమాణాలు పాటించని 25 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎటువంటి కోర్సులకు అనుమతి ఇవ్వలేదని శైలజారామయ్యర్ చెప్పారు. క్వాలిటీ లేని కాలేజీల్లో 40 వేల సీట్లను తగ్గించామన్నారు.నిజనిర్ధారణ కమిటీలు అన్ని కళాశాలలను పరిశీలించాయని చెప్పారు. క్వాలిటీ సెల్ ఏర్పాటు చేసి కాలేజీలకు రేటింగ్ ఇచ్చేలా సంస్కరణలు తీసుకొస్తామని, కాలేజీలు నాణ్యతాప్రమాణాలను తప్పకుండా పాటించాలని శైలజా రామయ్యర్ స్పష్టం చేశారు. త్వరలోనే అనుమతి పొందిన కాలేజీలు, కోర్సుల వివరాలు ప్రకటిస్తామన్నారు. అనుమతులు పొందిన, అనుమతులు నిరాకరించిన కాలేజీల వివరాలు వెబ్ సైట్ లో పొందుపరుస్తామని శైలజారామయ్యర్ వివరించారు.
సీఈలో 9,825, సీఎస్‌ఈ 22,440, ఐటీ 2,160, ఈసీఈ 20,070, ట్రిపుల్ ఈ 9,945, ఎంఈ 9,285, ఇతర బ్రాంచీల్లో 2,910 సీట్లు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించారు.
జేఎన్టీయూ హైదరాబాద్ కు అనుబంధంగా 290 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా.. వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోని, ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న 45 కాలేజీలకు అనుమతులు నిరాకరించారు.