ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

1
– నేటి నుంచి వెబ్‌ ఆప్షన్లు

– మంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్‌,జులై16(జనంసాక్షి):

ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.శుక్రవారం  సాయంత్రం 5 గంటల నుంచి ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు ఓపెన్‌ అవుతాయని ఆయన ప్రకటించారు. విద్యార్థులంతా వెబ్‌ సైట్‌ లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. హైకోర్టులో కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల పిటిషన్ల కారణంగా వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆలస్యం అయ్యిందని కడియం చెప్పారు.

ఈ నెల 21 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, 22న వెబ్‌ ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంటుందని, 23న డేటా ప్రాసెసింగ్‌ చేస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. మొదటి దశ సీట్ల కేటాయింపు ఈ నెల 24 న చేస్తామని, 25 నుంచి 27 తేదీల్లో ఆయా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్టు చేయాలని సూచించారు. ఈ నెల 29న తుది దశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరిపి.. 29, 30 తేదీల్లో ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఇస్తామని, తుది దశ సీట్ల కేటాయింపు 31 న చేస్తామని చెప్పారు. వీరంతా ఆగస్టు 1న కాలేజీల్లో రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వివరించారు.

జేఎన్టీయు హైదరాబాద్‌ 220 ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తున్నట్టు 28 జూన్‌, 2015న ప్రకటించిందని కడియం శ్రీహరి గుర్తుచేశారు. ఈ కాలేజీల్లోనూ కొన్ని కోర్సులకు మాత్రమే అనుమతి ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో లక్షా 10 వేలకు పైగా ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉండగా, ఇప్పటి వరకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేసుకున్న విద్యార్థుల సంఖ్య 82,795 మాత్రమే ఉందన్నారు. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలోని 22 కాలేజీల్లో 9,838 సీట్లు ఉన్నాయని చెప్పారు.

కొన్ని కోర్సులకు, కాలేజీలకు జేఎన్టీయు అఫిలియేషన్‌ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ 121 కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్‌ వేశాయని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. వాటిలోనూ కౌన్సిలింగ్‌ కు అనుమతించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ కు అప్పీలు చేసిందని చెప్పారు. రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. ఎఐసీటీఈ నుంచి ఇద్దరు, జేఎన్టీయూ హైదరాబాద్‌ నుంచి ఒక్కరు చొప్పున తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి, ఈ నెల 28 లోపు పిటిషన్‌ వేసిన కాలేజీల్లో తనిఖీలు పూర్తి చేయాలని ఆదేశించిందన్నారు. తనిఖీ నివేదికలను జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ కు, జేఎన్టీయూ హైదరాబాద్‌ కు చెరో కాపీ ఇవ్వాలని చెప్పిందన్నారు. కాలేజీలకు, కోర్సులకు తనిఖీలు అవసరం లేదనుకున్న యాజమాన్యాలు జేఎన్టీయూకి లేఖ ఇవ్వాలని సూచించిందని చెప్పారు.

పిటిషన్‌ వేసిన 121 కాలేజీల్లో మొత్తానికి గాని, కొన్ని కోర్సులకు గాని తనిఖీలు అవసరం లేదని 73 కాలేజీలు లేఖలు ఇచ్చాయని కడియం వివరించారు. వారు కోరిన కోర్సులకు రేపటి నుంచి జరిగే కౌన్సిలింగ్‌ లో అవకాశం కల్పిస్తామన్నారు. ఐతే, హైకోర్టు ఆదేశాలతో కౌన్సిలింగ్‌ జరిగే కాలేజీలు, కోర్సుల్లో అడ్మిషన్లు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తనిఖీల తర్వాత అర్హత సాధించని కాలేజీ లేదా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఫీజులను వడ్డీతో సహ చెల్లించాలని హైకోర్టు షరతు విధించినట్టు చెప్పారు. ఆ విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేస్తామన్నారు. కోర్టుకు వెళ్లిన 121 కాలేజీలు, వాటిలో కోర్సుల వివరాలు జెఎన్టీయు(హైదరాబాద్‌) వెబ్‌ సైట్‌ లో ఉంచామని కడియం శ్రీహరి వెల్లడించారు. హైకోర్టు ఆర్డర్‌ ను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఆప్షన్లు ఎక్సర్‌ సైజ్‌ చేయాలని ఆయన సూచించారు. కోర్టుకి వెళ్లని ఇతర మేనేజ్‌ మెంట్లు కూడా హైకోర్టు తీర్పుకు లోబడి ఉంటామని ఇవాళ రాత్రి 10 గంటల లోగా దరఖాస్తు చేసుకుంటే కౌన్సిలింగ్‌ కు అవకాశం కల్పిస్తామని చెప్పారు.

కౌన్సిలింగ్‌ కు అనుమతించే మొత్తం కాలేజీలను మూడు కేటగిరీలుగా విభజించినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. జేఎన్టీయు గుర్తింపు ఇచ్చిన 220 కాలేజీలను మొదటి కేటగిరిలో, కోర్టుకు వెళ్లిన కాలేజీలను రెండో కేటగిరిలో, కోర్టుకు వెళ్లకున్నా అనుమతించిన కాలేజీలను మూడో కేటగిరిలో ఉంచామని చెప్పారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి, జేఎన్టీయూ (హైదరాబాద్‌) ఇన్చార్జ్‌ వీసీ శైలజా రామయ్యర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.