ఇంటర్‌ ఫస్టియర్‌లో ఫైలైనోళ్లందరూ పాస్‌..


` తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
` విద్యార్థులకు ఇదే చివరి అవకాశమన్న మంత్రి సబిత
` రాజకీయ పార్టీలు నిజాలు తెలుసుకోవాలంటూ చురకలు
హైదరాబాద్‌,డిసెంబరు 24(జనంసాక్షి):ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విూడియా సమావేశంలో తెలిపారు. ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌విూట్‌లో సబితా ఇంద్రారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఫస్టియర్‌లో ఫెయిలయిన విద్యార్థులందరిని కనీస శాతం(35శాతం) మార్కులతో పాస్‌ చేస్తున్నట్లు తెలిపారు. అందరిని పాస్‌ చేయడం ఇదే చివరిసారని.. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండవని పేర్కొన్నారు. ఫలితాలపై విద్యార్థులు ఆందోళన చేయడం సరికాదన్నారు. సిలబస్‌ తగ్గించి, వారికి అవకాశం కల్పించినా వారు పరీక్షలో నెగ్గలేదన్నారు. దీనికి ఇంటర్‌ బోర్డు లేదా మరెవరీ తప్పులేదన్నారు. అయినా వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సారికి వారిని పాస్‌ చేయాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించారని అన్నారు. కోవిడ్‌తో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. కోవిడ్‌ సంక్షభం కారణంగా మూడో తరగతి నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాం. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించాం. అన్ని అంశాలు ఆలోచించిన తర్వాతే పరీక్షలు పెట్టాం. తాజాగా ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు పాసవ్వగా..మిగిలిన 51 శాతం మంది ఫెయిలయ్యారు. అయితే ఫెయిలయిన వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలలో చదివిన విద్యార్థులే ఉన్నారు. ఫస్టియర్‌ ఫలితాలపై ప్రభుత్వాన్ని, సీఎంను టార్గెట్‌ చేయడం సరికాదు. ప్రతీదీ రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు అలవాటైపోయిందని మండిపడ్డారు. విద్యార్థులు సరిగా రాయలేకపోతే దానికి ఎవరు బాధ్యులో తల్లిదండ్రులు కూడా ఆలోచించాలన్నారు. అందుకే ఇంటర్‌ మొదటి సంవత్సరం లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు అందరు పాస్‌ అయినట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు అందరిని కనీస మార్కులతో పాస్‌ చేస్తున్నట్లు వెల్లడిరచారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు సిద్దం అవుతున్న తరుణంలో వారిని మానసికంగా ఇబ్బందికి గురి చేయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో ఫెయిలైన 51 శాతం మంది అంటే 2 లక్షలా 30 వేల మంది విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కనీస మార్కులతో అందరినీ పాస్‌ చేస్తున్నామన్నారు. అందరినీ పాస్‌ చేయడం ఇదే చివరి సారని, భవిష్యత్తులో ఇలా చేయబోమన్నారు. విద్యార్ధులంతా చదువుకోవాల్సిందేనని సబిత స్పష్టం చేశారు.