ఇంటింటి ప్రచారంలో పొన్నం ప్రభాకర్‌

నిరంకుశ కెసిఆర్‌ పాలనకు చరమగీతం పాడాలి

ప్రజాకూటమికి ఓటేసి గెలిపించండని పిలుపు

కరీంనగర్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు ఓటేసి గెలపించి ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు తోడ్పడాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కరీంనగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆశీర్వదించి, నిరంకుశ కెసిఆర్‌ పాలనకు చరమయగీతం పాడాలన్నారు. సోమవారం నాడాయన పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అందరినీ పలకరిస్తూ తనకు ఓటేసి గెలిపించి ఆశర్వదించాలన్నారు. కాంగ్రెస్‌ కూటమి మాత్రమే ప్రజల పక్షాన పోరాడగలదన్నారు. కేవలం కుటుంబానికే పరిమితమైన కెసిఆర్‌ను ఈ ఎన్నికల్లో ఓటుతో తిరస్కరించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా ప్రజలకు ఇచ్చిన పలు హామిలపై సోమవారం ఎన్నికల సభలో సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ను డల్లాస్‌ చేస్తానన్న హావిూ ఏమయ్యిందన్నారు. ప్రాజెక్టుల పునరాకృతి పేరుతో కోట్లు దోచుకున్నారని, ప్రజాధనం వృధా చేశారని అన్నారు. కరీంనగర్‌ జిల్లాను ఏడు ముక్కలు చేసి అభివృద్ధిని దెబ్బతీశారని మండిపడ్డారు. జిల్లాకు ప్రకటించిన వైద్య కళాశాల ఏమైందని, శాతవాహన విశ్వవిద్యాల యానికి ఉప కులపతిని ఎందుకు నియమించలేదు, ప్రభుత్వాసుపత్రిని ఎందుకు ఆధునీకరించలేదో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. కరీంనగర్‌ అభివృద్ధి కోసం వేసిన శిలాఫలకం ఏమైందని ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాద బాధితులను సీఎం ఎందుకు పరామర్శించలేదో జవాబు ఇవ్వాలన్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి గెలిచి తీరుతుందని, కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు, కరీంనగర్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీకి వెళ్లక తప్పదన్నారు. కరీంనగర్‌లోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని, తాను చేపట్టిన పాదయాత్రకు మంచి ప్రజా స్పందన ఉందని, కాంగ్రెస్‌ గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షసపాలన అంతమొం దించాలంటే…ప్రతీ ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పరిమితం చేయాలని ఓటర్లకు పిలుపు నిచ్చారు.ఈ సందర్బంగా కేసీఆర్‌ పాలన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేలకోట్లు దోచుకున్న దొరలపాలనకు చరమగీతం పలికే సమయం ఆసన్నమైందన్నారు. ప్రజాపాలన కావాలంటే మార్పు అవసరం కాబట్టి ప్రజాకూటమికి పట్టం కట్టాలని విన్నవించారు. మాయమాటలతో కాలం గడిపిన కెసిఆర్‌ ఇంకెంతకాలం ప్రజలను మోసం చేయలేరని పొన్నం అన్నారు.