ఇంటింటి ప్రచారానికి మంత్రి జోగు ప్రాధాన్యం
పథకాలను వివరిస్తూ ఓట్టు అడుగుతూ ప్రచారం
మరోమారు గెలిపించి అభివృద్దికి ఓటేయాలని పిలుపు
ఆదిలాబాద్,అక్టోబర్25(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో మంత్రి జోగురామన్న పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకూ కాలనీల్లో విస్తృతంగా పర్యటించి నాలుగేండ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచారానికి వచ్చిన మంత్రికి కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి, తిలకం దిద్ది ఆశీర్వదించారు. వృద్ధులను అక్కున చేర్చుకొని పింఛన్ వస్తుందా అంటూ ఆరా తీశారు. తమ ఇంటికి ఓట్లు అడగడానికి వచ్చిన మంత్రిని వృద్ధులు ఆశీర్వదించారు. విూ చల్లని దీవెనలే టీఆర్‌ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు రక్ష అన్నారు. కడుపులో బిడ్డ నుంచి కాటికి పోయే వృద్ధుడి వరకూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకొన్న టీఆర్‌ఎస్‌ను మరోసారి దీవించాలని మంత్రి జోగు రామన్న అన్నారు. ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. కాలనీవాసులకు ఏవైనా సమస్యలుంటే అడిగి తెలుసుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు గతంలో రూ. 200, రూ.500 ఉంటేరూ.1000, రూ.1500కు పెంచామన్నారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆడబిడ్డల పెండ్లి ఇంట్లో సంతోషాన్ని నింపుతున్నాయన్నారు. కేసీఆర్ కిట్లను అందజేసి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచామన్నారు. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేల నగదు, మాతా శిశు సంరక్షణ కేసీఆర్ కిట్లను అందజేస్తున్న సర్కారు ఎక్కడా లేదన్నారు. పేదబిడ్డలు చదువుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి ఇంగ్లిష్ విూడియం చదువులు చెబుతున్నామన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.కోటి నిధుల కోసం హైదరాబాద్‌లో నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్ హయాంలో నాలుగేళ్లలో రూ.4336 కోట్ల నిధులు తీసుకువచ్చానన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల పాలన ఒకత్తెయితే టీఆర్‌ఎస్ పాలన ఒకెత్తన్నారు. 68 సంవత్సరాలు రాష్ట్రం వెనుకబాటుకు గురైతే సీఎం కేసీఆర్ నాలుగు సంవత్సరాల్లోనే సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. రాష్ట్ర బడ్జెట్ పెరగడంతో టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో ఆసరా పింఛన్లను రూ.2016, రైతు బంధు పథకానికి ఎకరాకు రూ.10వేలు పెంచామన్నారు. నిరుద్యోగ భృతిని రూ.3016 ప్రకటిస్తూ మ్యానిఫెస్టోలో పొందుపర్చామన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై స్పష్టంగా అవగాహన ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఇచ్చిన హావిూలను కచ్చితంగా అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తుందన్నారు. మహా కూటమి ఒక అతుకుల బొంత అని.. వారికి అధికారమిస్తే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తారన్నారు. కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్ పార్టీకి ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష తదితరులు పాల్గొన్నారు.