ఇంటిపేరును చూసి అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారు..?

– ప్రతిభ ఆధారంగా అధ్యక్షున్ని ఎన్నుకోవాలి

– నిజాయితీగా ఎన్నిక నిర్వహిస్తే బరిలోకి దిగేందుకు తాను సిద్ధం

– రాహుల్‌గాంధీకి లేఖరాసిన షెహజద్‌ పూనవల్లా

ముంబయి, నవంబర్‌30(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై వ్యవహరిస్తున్న తీరును సొంత పార్టీ అభ్యర్థి మహారాష్ట్ర కాంగ్రెస్‌ సెక్రటరీ షెహజద్‌ పూనవల్లా వ్యతిరేకించారు. పార్టీ అధ్యక్షుడిని ప్రతిభ ఆధారంగా ఎన్నుకోవాలే కానీ, ఇంటిపేరుతో ఎన్నుకోవడం సరికాదని మండిపడ్డారు. వారసత్వ రాజకీయాలను కొనసాగించడాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే తొలుత రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

అధ్యక్షపదవి ఎన్నికలు నిజాయతీగా నిర్వహిస్తే బరిలో దిగడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. దీనిపై పూనవల్లా రాహుల్‌కు లేఖ రాశారు. ‘రిగ్గింగ్‌ చేసే ఎన్నికల్లో నేను పోటీ చేయను, నిజాయతీగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించండి పోటీ చేస్తానని తెలిపారు. ఇది ఎలక్షన్‌ కాదు.. సెలక్షన్‌. పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకొనే ప్రతినిధులు రాజ్యాంగం నిబంధనల ప్రకారం ఎన్నుకోవడంలేదు. ప్రతిభ ఆధారంగా అధ్యక్షుడిని ఎన్నుకోవాలి కానీ, ఇంటి పేరును పెట్టుకొని గెలవడం కాదన్నారు. వేరే నేతల కంటే బాగా ప్రసంగాలు ఇవ్వగలరా? ప్రజలకు సేవ చేద్దామని పార్టీలోకి వచ్చిన కార్యకర్తల పరిస్థితి ఏమిటి? పార్టీ అధ్యక్షురాలి విూ అమ్మ అయినంత మాత్రాన మిగతా వారిని వదిలిపెట్టి సొంతవాళ్లకే పట్టం కట్టడం సబబు కాదు’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా డిసెంబర్‌ 16న పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు. 19న ఫలితాలు వెల్లడిస్తారు. డిసెంబరు 4 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే.. రాహుల్‌గాంధీ తప్ప ఇంకెవరూ నామినేషన్‌ వేయకపోతే.. నామినేషన్ల పరిశీలన రోజే రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు.