ఇండియాకు పాక్ విమానాలు ర‌ద్దు

పాకిస్తాన్ నుంచి ముంబైకి వచ్చే వారం నుంచి విమానాల‌ను ర‌ద్దు చేసే యోచ‌న‌లో ఉంది పాకిస్తాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్‌. క‌రాచీ నుంచి ముంబైకి వారానికి రెండు విమానాల‌ను న‌డుపుతోంది పాకిస్తాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్‌. కానీ పాకిస్తాన్‌కు భార‌త్‌నుంచి ఎలాంటి విమాన స‌ర్వీసులు లేవు. రెండు దేశాల మ‌ధ్య యుద్ధ‌వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో ప్ర‌యాణికుల ర‌ద్దీ కూడా చాలా తగ్గినందున ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పాక్ ఎయిర్‌లైన్స్ సంస్థ తెలిపింది.

మూడురోజుల క్రితం భార‌త సైనికుల‌ను పాక్ సైనికులు హ‌త్య చేయ‌డంతో ప‌రిస్థితులు మ‌రింత విష‌మించాయి. దీంతో పాక్ చ‌ర్య‌ల‌కు త‌ప్ప‌కుండా స‌రైన స‌మ‌యంలో ఘాటుగా స్పందిస్తామ‌ని భార‌త ప్ర‌భుత్వం కూడా తేల్చిచెప్పింది. ఈ నేప‌థ్యంలోనే ఇరుదేశాల మ‌ధ్య యుద్ధ‌మేఘాలు అలుముకున్నాయి. దీంతో ప్ర‌యాణికులు కూడా భార‌త్‌లో అడుగుపెట్టేందుకు జంకుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే భార‌త్‌కు త‌మ విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసే యోచ‌న‌లో పాక్ ఎయిర్‌లైన్ ఉన్న‌ట్లు స‌మాచారం. క‌రాచి నుంచి ఢిల్లీకి కూడా ప్ర‌స్తుతం నడుస్తున్న విమాన స‌ర్వీసుల‌ను కూడా ర‌ద్దు చేసే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.