ఇందూరుతో ఎన్నికల సమరం
ఉమ్మడి జిల్లా వేదికగా నేడు నిజామాబాద్ సభ
భారీగా ఏర్పాట్లు చేసిన గులాబీ నేతలు
విపక్షాల తీరును తూర్పారా బట్టేలా సభలో కెసిఆర్ ప్రసంగం
అధినేత కెసిఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేలా ప్రణాళిక
గులాబీవనంలా తయారైన నగరం
నిజామాబాద్,అక్టోబర్2(జనంసాక్షి): ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్న గులాబీదళం మలి సభతో మరింత ఊపును ఇవ్వబోతున్నది. హుస్నాబాద్ సభ తరవాత ఇప్పుడు నిజామాబాద్ వేదికగా భారీ బహిరంగ సభను బుధవారం నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ సభ తరవాత జరిగిన రాజకీయ సవిూకరణాలు, మార్పులు, విమర్శలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ విపక్షాలపై విమర్శల బాణాలు సంధించనున్నారు. ఈ సభతో అటు నేతల్లోనూ, ఇటు కార్యకర్తల్లోనూ మరోమారు పునరుత్తేజం కలిగించనున్నారు. ఇందుకు అనుగుణంగా ఉమ్మడి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న తెరాస బహిరంగ సభ కీలకం కానున్నది. సెప్టెంబర్ 6న సభను రద్దు చేయడంతో పాటు 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ మరుసటి రోజే సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో బహిరంగ సభ పెట్టారు. అయితే అప్పట్లో ఇంకా ఇతర పార్టీల్లో ఎన్నికల హడావిడి, పొత్తుల విషయాల్లో స్పష్టత లేదు. ప్రస్తుతం రాజకీయ వేడి మొదలైంది. ఇలాంటి తరుణంలో జరుప తలపెట్టిన ఉమ్మడి జిల్లాల స్థాయి సభలను ఇందూరు నుంచి ఆరంభిస్తున్నారు. ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల మూడు మాసాలు పాలన చేసిన కేసీఆర్ పార్టీ అధినేత ¬దాలో సభలో బుధవారం ప్రసగించనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన మాట్లాడతారని భావిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టారు. భారీ జనసవిూకరణకు ఆ పార్టీ ప్రతినిధులు దృష్టి సారించారు. మహిళా నేతలు ఇంటింటికి తిరుగుతూ సభకు ఆహ్వానిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డితో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల తాజా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పటికే జనసవిూకరణపై సవిూక్షించారు. భారీగా జనాలను తరలించి అదుర్స్ అనేలా సభను నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల సదస్సులో భాగంగా అక్టోబర్ 3న ఉమ్మడి నిజామాబాద్‌లో మొదటి సదస్సు నిర్వహించనున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి 9 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నాయకులను పెద్ద ఎత్తున తరలించి సదస్సును విజయవంతం చేస్తామని చెప్పారు. నాలుగేండ్లలోనే తెలంగాణ ప్రభుత్వం నూతన ఒరవడితో అభివృద్ధిలో అందరి మన్ననలు అందుకుటున్నదని, దానిని మరోమారు నాయకుడు కెసిఆర్ వివరిస్తారని అన్నారు. ఇకపోతే సభ విజయవంతం కోసం వివిధ కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ ఆశీర్వదించేందుకు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఈ తరహా ప్రచార సందర్భంలో కారు బొమ్మను అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇందూరు నగరంలో గులాబీ జెండాలు, బ్యానర్లతో ఆకట్టుకుంటోంది. ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో గులాబీ దళపతికి ఘన స్వాగతం పలికేందుకు నేతలు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. సభ జరిగే గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు జరిగాయి. సభాస్థలి వద్దే హెలీప్యాడును సిద్ధం చేశారు. నిజామాబాద్ అర్బన్, గ్రావిూణం, ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున జనసవిూకరణ చేయాలన్న అంచనాతో ఉన్నారు. ఈ ప్రాంతాలకు సభ జరిగే ప్రదేశం దగ్గరవుతుండటంతో పోలీసులు సైతం ఇదే అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. జనసవిూకరణకు ఇప్పటికే వాహనాలను సిద్ధం చేసుకొన్నారు. వీటిని బుధవారం ఉదయానికి కల్లా ఆయా గ్రామాల్లో సిద్ధంగా ఉంచనున్నారు. ఒక్కో బస్సుకు గ్రామస్థాయి నాయకులు ఇన్‌ఛార్జిగా ఉంటారని చెబుతున్నారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కవిత సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం నియమించిన కమిటీలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది శాసనసభ స్థానాలను గత ఎన్నికల్లో గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఒకరిద్దరిపై నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందనే ప్రచారం కొంతకాలం కిందటి వరకు జరిగింది. వారికి ఈ సారి టిక్కెట్టు దక్కటం కష్టమే అనుకున్నారు. కానీ ఆ విషయాలను పక్కన పెట్టి తాజా మాజీలందరికీ అధినేత మరో అవకాశం ఇచ్చారు. దీంతో అప్పటి వరకు డీలాపడిన నేతలు, ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ ఎన్నికలు జరిగే నాటికి సదరు అభ్యర్థులపై వారి వారి నియోజకవర్గాల్లో పరిస్థితిని బట్టి మార్పులుండొచ్చనే ప్రచారమూ జరిగినప్పటికీ అవన్ని వదంతులే అని అధినేత చెప్పటంతో ఊరట చెందారు. ఇలాంటి పరిణామాల నడుమ ఉమ్మడి జిల్లాల స్థాయి సభలను నిజామాబాద్ నుంచే ప్రారంభించేందుకు కేసీఆర్ నిర్ణయించటంతో ఇక్కడి అభ్యర్థులంతా అప్రమత్తం అయ్యారు. విజయవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అధినేత దృష్టిని ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.