ఇక ఇందిరమ్మ ఇళ్ల సమస్యల పరిష్కారం
– దృష్టి సారించిన అధికారులు
ఖమ్మం, అక్టోబర్ 29 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తలెతుత్తున్న సమస్యలను పరిష్కరించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రధానంగా గృహ నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల రేట్లు కూడా అధికంగా పెరిగిపోవడంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు ధైర్యం చేయడం లేదు. ఒకవేళ ఇంటి నిర్మాణం ప్రారంభించినా పీకలలోతు అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సొంత ఇంటి కల నెరవేర్చేందుకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రణాళిక తయారు చేసింది. గృహ నిర్మాణ సంస్థ నిర్మిత కేంద్రాల ద్వారా పంపిణీ చేసే సామగ్రితో తక్కువ ఖర్చుతో ఎలా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించ వచ్చో మేస్త్రీలకు శిక్షణ ఇస్తారు. జిల్లాలో ఇప్పటికే 84 మంది మేస్త్రీలను గృహ నిర్మాణ శాఖ అధికారులు గుర్తించారు. వారికి త్వరలో హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 70వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభించాల్సిన దశలోనే ఉన్నాయి. వీటిలో కనీసం 20వేల ఇళ్లనైనా నిర్మిత కాలంలో పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. గృహ నిర్మాణ సామగ్రి ఖర్చులు విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో లబ్థిదారులు ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యకు సుక్షిస్తులైనా మేస్త్రీల ద్వారా పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. మేస్త్రీలకు నిర్మితి కేంద్రాల్లో అతి తక్కువ ఖర్చుతో ఇందిర్మ ఇంటి నిర్మాణం ఎలా పూర్తి చేయాలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న మేస్త్రీలకు లక్ష్యలు నిర్దేశిస్తారు. లక్ష్యలు పూర్తి చేసిన వారికి ప్రోత్సహ బహుమతులు అందించేందుకు గృహ నిర్మాణ శాఖ సిద్ధమవుతోంది. 2000 ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసిన మేస్త్రీలకు 3లక్షలు విలువైన ఇంటిని ఉచితంగా నిర్మించుకునేందుకు అవకాశం కల్పిచేందుకు గృహ నిర్మాణ సంస్థ ఎండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే సుతారి, మేస్త్రీలకు శిక్షణ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా మేస్త్రీలకు శిక్షణ ఇచ్చి, చౌకగా ఇళ్లు నిర్మించే ప్రణాళిక గృహ నిర్మాణ సంస్థ అధికారులు గతంలోనే అమలు చేశారు. నెల రోజుల శిక్షణ ఇచ్చారు. అయితే శిక్షణ తీసుకున్న అనంతరం మేస్త్రీలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించకుండా, ప్రైవేటు అపార్ట్‌మెంట్లు, బైటా ఇళ్లు నిర్మించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనితో ఇందిరమ్మ ఇళ్లు అలాగే నిలిచిపోయాయి. ఈ సారి మళ్లీ అలాంటి సమస్య తలెత్తకుండా గృహ నిర్మాణ సంస్థ గట్టి జాగ్రత్తలు తీసుకుంటుంది. మేస్త్రీలకు నెలరోజుల పాటు శిక్షణ ఇచ్చి, ఇందిరమ్మ కాలనీలు అప్పగించడమే కాక, ప్రైవైటు అపార్ట్‌మెంటు, ఇళ్లు నిర్మించకుండా చర్యలు తీసుకుంటారు. కేవలం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడానికి ఒప్పుకున్న మేస్త్రీలను మాత్రమే నియమిస్తారు. వారు లక్ష్యలు పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షిస్తారు.