ఇక కవాతును మించిన ఉద్యమం
భవిష్యత్ ఉద్యమంపై జేఏసీ కదన కుతూహలం
కవాతులో హింసకు ప్రభుత్వమే కారణం
బేషరతుగా కేసులు ఉపసంహరించుకోవాలి
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్, అక్టోబర్ 6 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. తెలంగాణ మార్చ్‌ని మించిన బలమైన ఉద్యమాలు చేస్తామని, త్వరలోనే ఇందుకు కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసినందుకు జేఏసీ తరఫున తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శనివారంనాడు ఎంపీ మధుయాష్కీ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో జేఏసీ, ప్రజా సంఘాల నేతలు సమావేశమయ్యారు. అనంతరం కోదండరామ్, ఎంపీలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మార్చ్ తమకెంతో రాజకీయ బలాన్ని ఇచ్చిందని కొందండరామ్ అన్నారు. భవిష్యత్తులో జేఏసీ తెలంగాణ కోసం చేపట్టే కార్యక్రమాలకు మద్దతునిస్తామని ఎంపీలు హామీ ఇచ్చారన్నారు. తమకు బలమైన అండగా ఉండాలని కోరామన్నారు. భవిష్యత్తులో ఇలాగే పరస్పర సహకారం ఉంటాయని ఆశిస్తున్నామని చెప్పారు. మార్చ్ సందర్భంగా అరెస్ట్‌లు చేయడం తెలంగాణ ప్రజలను అవమానించినట్టుగా భావిస్తున్నామన్నారు. తమపై కేసులు పెట్టడమంటే తెలంగాణ ప్రజలపై కేసుల పెట్టడమేనన్నారు. ప్రభుత్వం అనుసరించిన వైఖరిని గర్హిస్తున్నామని అన్నారు. తెలంగాణవాదంపై ప్రభుత్వ దాడిగానే చూస్తున్నాంతప్ప వేరే విధంగా చూడటానికి తాము సిద్ధంగా లేమన్నారు. అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. మార్చ్ సందర్భంగా పోలీసులు ఉన్నచోటే ఉద్రిక్తతలు తలెత్తాయన్నారు. పోలీసులు రెచ్చగొట్టడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో వందలాదిమంది ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మార్చ్ సందర్భంగా గాజు ముక్కలు పగిలితే కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. తమపై కేసులు ఎందుకు పెట్టారని నిలదీశారు. పగిలినగాజు ముక్కలకంటే ఉద్యమంలో నేలకొరిగిన తెలంగాణ వాదుల ప్రాణాలే విలువైనవని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌కు కొనసాగింపుగా మరింత ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ఈ ఉద్యమాల్లో సీమాంధ్రులు కూడా భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణ మార్చ్ విజయవంతం అయిందన్నారు. అక్రమ కేసులకు వ్యతిరేకంగా మంత్రులతో కలసి పోరాటం సాగిస్తామన్నారు. నవంబర్ 1న రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రులు పాల్గొనరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. జేఏసీ ప్రతిపాదనతో విభేదించిన ఎంపీ బలరాంనాయక్ అంతకుముందు సమావేశంలో మార్చ్ సందర్భంగా జరిపిన అరెస్టులు, భవిష్యత్ కార్యాచరణ, జేఏసీ చైర్మన్‌గా స్వామిగౌడ్‌ను మార్చాలన్న కేసిఆర్ ఆలోచన తదితర అంశాలపై వీరు సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి ఏడుగురు టిఎంపీలు హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావుతో పాటు ఎంపీలు పొన్నం ప్రభాకర్, మందా జగనాథం, గుత్తా సుఖేంద్రర్‌రెడ్డి, రాజయ్య, వివేక్, బలరాంనాయక్ హాజరయ్యారు. అయితే, మంత్రులపై, కేంద్రంపై తెలంగాణ సాధనలో భాగంగా ఒత్తిడి పెంచాలన్న జేఏసీ ప్రతిపాదనలను నిరాకరిస్తూ బలరాం నాయక్ సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయారు. తనకు తెలంగాణ జేఏసీతో సంబంధంలేదని, కాంగ్రెస్ నిర్ణయాల మేరకే తాను నడుచుకుంటానని చెప్పి మధ్యలోనే నిష్క్రమించారు. తెలంగాణ వాదాన్ని బలంగా ఢిల్లీకి పిలిపించాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ మంత్రులను కూడా ఉద్యమంలోకి తెచ్చేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. మార్చ్ సందర్భంగా తెలంగాణ వాదులు, ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈనెల 16న ప్రధాని మన్మోహన్ హైదరాబాద్‌కు వస్తున్నందున నిరసన ప్రదర్శన చేయడం ద్వారా తెలంగాణ విషయాన్ని మరోమారు ఆయన దృష్టికి తీసుకెళ్ళాలని నిర్ణయించారు. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ భేటీ వచ్చివుంటే బాగుండేదని సమావేశం అభిప్రాయపడింది. మంత్రులను ఉద్యమంలోకి రప్పించేందుకు జేఏసీ తరఫున తామేమి చేయాలి, కాంగ్రెస్ వారిగా ఏంపీలు ఏం చేయాలి అనే విషయంపై చర్చించారు. భవిష్యత్తులో తెలంగాణ సాధన కోసం కలిసి పనిచేద్దామన్న జేఏసీ ప్రతిపాదనపై ఎంపీలు మల్లగుల్లాలు పడ్డారని సమాచారం.