ఇక పార్టీలకు కాళ్ళమే

636177110697398276న్యూఢిల్లీ, డిసెంబరు 18: ఎన్నికల వేళ నల్ల ధనంతో చెలరేగిపోయే రాజకీయ పార్టీల దూకుడుకు కళ్లెం పడనుంది. ఈ దిశగా ఎన్నికల సంఘం పలు కీలక సంస్కరణలు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందు పలు ముఖ్యమైన ప్రతిపాదనలను ఉంచింది. వాటిలో ప్రధానమైనది… రూ.2వేలు, అంతకు మించిన గుప్త విరాళాల లెక్క తేల్చడం. గతంలో పార్టీలకు వచ్చే రూ.20 వేలు లోపు గుప్త విరాళాలకు ఎలాంటి లెక్క చెప్పకున్నా నడిచిపోయేది. దీన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున గుప్త విరాళాలను సేకరించేవి. వాటి ముసుగులో నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చేవి. ఇకపై ఈ విధానానికి స్వస్తి పలకాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. రాజకీయ పార్టీలకు వచ్చే గుప్త విరాళాల్లో రూ.2వేలు, అంతకు మించిన వాటిపై నిషేధం విధించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. పార్టీలకు రూ.2వేలు, అంతకు మించి వచ్చే విరాళాలకు తప్పనిసరిగా లెక్క చెప్పే విధంగా ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలని ఈసీ, కేంద్రాన్ని కోరింది. ‘ఇప్పటి వరకు పార్టీలకు వచ్చే గుప్త విరాళాలపై ఎలాంటి చట్టబద్ధమైన నిషేధం లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 29సి మాత్రం.. రూ.20 వేలకు మించిన విరాళాలను పార్టీలు వెల్లడించాలని మాత్రమే సూచిస్తోంది. దీంతో ఆ మొత్తానికన్నా తక్కువ వచ్చే గుప్తవిరాళాల గుట్టు బ్రహ్మరహస్యంగా ఉండిపోతోంది. ఇది పార్టీలు నల్లధనం పోగేసుకోవడానికి దారితీస్తోంది’ అని ఎన్నికల సంఘం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తమ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. రూ.2వేలు, ఆపై వచ్చే విరాళాల లెక్కలను అన్ని పార్టీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ విధానంతో ఎన్నికల్లో నల్లధనం చలామణికి చెక్‌ పడుతుందని ఈసీ భావిస్తోంది.

గెలిచిన పార్టీకే..

రాజకీయ పార్టీలు పొందుతున్న పన్ను రాయితీలపైనా ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇప్పటి వరకు గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలన్నిటికీ పన్ను మినహాయింపులను కల్పిస్తున్నారు. 1961 ఆదాయపన్ను చట్టం 13ఏ ప్రకారం రాజకీయ పార్టీలకు.. గృహాలు, స్థలాలపై వచ్చే ఆదాయంపైన, స్వచ్ఛంద విరాళాల ద్వారా సమకూరే ఆదాయంపైన, క్యాపిటల్‌ గెయిన్స్‌ ద్వారా వచ్చే ఆదాయంపైన పన్ను మినహాయింపు ఉంది. జీతాల పద్దు, వ్యాపార, వృత్తిపరమైన ఆదాయాలపైనే రాజకీయ పార్టీలు పన్ను చెల్లించాల్సి ఉండేది. ఈ పన్ను మినహాయింపును ఉపయోగించుకొని అన్ని పార్టీలు పెద్ద ఎత్తున లబ్ధి పొందేవి. ఇకపై ఈ విధానానికి చెక్‌ పెట్టాలని ఈసీ భావిస్తోంది. కేవలం ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచిన పార్టీలకే పన్ను మినహాయింపు వర్తింప చేయాలని ఈసీ, కేంద్రానికి ప్రతిపాదించింది. చాలా పార్టీలు పన్ను మినహాయింపులను ఉపయోగించుకొనేందుకు పుట్టుకొస్తున్నాయని, ఇలాంటి పార్టీలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈసీ అభిప్రాయపడింది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచిన పార్టీలకే పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా, అలాంటి వాటికి చెక్‌ పెట్టవచ్చని అభిప్రాయపడింది. 

కూపన్ల రాజకీయానికి చెక్‌ 

విరాళాలు సేకరణకు పార్టీలు రకరకాల మార్గాలు అనుసరిస్తుంటాయి. అందులో భాగంగా.. రూ.10, రూ.20ల రూపంలో విరాళాలు సేకరించి, ఆ మొత్తాలకు కూపన్లు ఇస్తుంటాయి. ఈ కూపన్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. ఒక పార్టీ ఎన్ని కూపన్లయినా ముద్రించుకోవచ్చు. కూపన్లను ఎవరికి ఇస్తున్నారు.. వంటి వివరాలు సేకరించాల్సిన అవసరం లేకపోవడంతో ఇలా కూపన్ల ద్వారా భారీ మొత్తాలను సేకరించినట్లు పార్టీలు లెక్కలు చూపేవి. దీంతో 1996లో సుప్రీంకోర్టు ఈ కూపన్ల రాజకీయానికి చెక్‌ పెట్టేందుకు.. పార్టీలు ఇచ్చే కూపన్లకు సంబంధించిన డోనర్ల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని తీర్పు చెప్పింది. ఇది అమలుకు నోచుకున్న దాఖలా లేదు. సుప్రీం ఉత్తర్వులను అమలయ్యేలా చూడాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను ఈసీ కోరింది. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతిపై యుద్ధం ప్రకటించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో నల్లధనం నిరోధానికి అంటూ పలు ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచడం గమనార్హం. అలా చేయడం ద్వారా తన ప్రతిపాదనలపై కేంద్రం ఏదో ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని ఈసీ కల్పించింది.