ఇక ప్రతి చెరువులో చేప పిల్లల పెంపకం-తలసాని
హైదరాబాద్,ఆగస్టు28: రాష్ట్రంలో చేప పిల్లల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. ఇప్పటికే పలు చెరువుల్లో చేపల పెంపకాన్ని చేపట్టిన సర్కార్ వచ్చే విడతలో భారీగా చేపలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సోమవారం సచివాలయంలో విూడియాతో మాట్లాడుతూ ఈ నెల 30న సింగూరు లో చేపపిల్లలను విడుదల చేయడం ద్వారా చేప పిల్లల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. ఈ ఏడాది 77 రిజర్వాయర్ లు, 4647 ప్రభుత్వ చెరువులు, 20 వేల 391 గ్రామపంచాయతీ చెరువులలో 69.66 కోట్ల చేప పిల్లలను వదలనున్నట్లు తెలిపారు. గత ఏడాది 29 కోట్ల చేప పిల్లలను విడుదల చేశామన్నారు. 6 నుంచి 8 నెలలు నీళ్లు నిల్వ ఉండే చెరువుల్లో తొలి ప్రాధాన్యతగా చేప పిల్లలను వదులుతామని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. రాష్ట్రంలో 14 లక్షల 76 వేల గొర్రెలను పంపిణీ చేశామని మంత్రి తలసాని వివరించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎంతో సంతృప్తి గా సాగుతోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిపే ముఖ్యమంత్రి మనకు ఉన్నారని తాను గర్వముగా చెప్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ రాజయ్య యాదవ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.