ఇక రైలుబండి భారం

రైల్వే చార్జీల పెంపునకు నిర్ణయం   అర్ధరాత్రి నుంచి అమలు

తప్పనిసరై  పెంచాం : బన్సాల్‌

న్యూఢిల్లీ, జనవరి 9 (జనంసాక్షి):
రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు  కేంద్ర రైల్వే శాఖమంత్రి పవన్‌కుమార్‌ బన్సాల్‌ తెలిపారు.  రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో పలు కారణాల వల్ల చార్జీల పెంపును వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. పదేళ్ళ తర్వాత రైల్వే చార్జీలను పెంచుతున్నామని చెప్పారు. పెరిగిన ఈ నెల 21 అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు. రైల్వేలో భద్రత, పరిశుభ్రతతకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. ధరల పెంపు ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇందుకోసమే ఉపయోగిస్తామని బన్సాల్‌ చెప్పారు. బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వేలు నష్టాలలో ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు తెలిపారు.
2004-05లో ఏడాదిలో రైల్వే శాఖకు రూ. 6,159కోట్ల నష్టం వచ్చిందని పవన్‌ కుమార్‌ బన్సాల్‌ తెలిపారు. 2010-11లో అది రూ. 19,964కోట్లకు పెరిగిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది రూ. 25వేల కోట్లకు చేరుకుం టుందని అంచనా ఉన్నట్లు ఆయన తెలిపారు. అనివార్య పరిస్థితుల కారణంగానే చార్జీలు పెంచామన్నారు. ప్రతి టికెట్‌పైన డెవలప్‌మెంట్‌ చార్జీ రూ. 5వసూలు చేయనున్నారు.  అన్ని  తరగతులకు 20శాతం ఛార్జీలను పెంచుతున్నట్లు చెప్పారు. ఆర్డినరి, సబర్బన్‌లలో కిలోమీటరుకు 2పైసలు, నాన్‌ సబర్బన్‌లో కిలోమీటరుకు 3పైసలు,  రెండో తరగతి మొయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ కిలోమీటరుకు 4పైసలు, స్లీపర్‌ క్లాస్‌లో కిలోమీరుకు 10పైసలు, ఏసీ చైర్‌కార్‌ కిలోమీటరుకు 10పైసలు, ఏసి టూటైర్‌ కిలోమీటరుకు 6పైసలు (ఇంతకు ముందు 15పైసలు పెరిగింది) ఎసీ ఫస్ట్‌క్లాస్‌ కిలోమీటరుకు 3పైసలు (ఇంతకుముందు 10పైసలు పెరిగింది), ఎసీ ఫస్ట్‌క్లాస్‌ స్లీపర్‌ కిలోమీటరుకు 30పైసలచొప్పున పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంచిన చార్జీలు జనవరి (ఈనెల) 21 అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నట్లు బన్సాల   తెలిపారు. చార్జీల పెంపు అనివార్యమనీ, ఇకపై బడ్జెట్‌లో చార్జీల పెంపు ఉండదని బన్సాల్‌ తెలియజేశారు. తాజా పెంపుదలతో అన్ని తరగతుల ప్రయాణికులపై భారం పడనుంది. కాగా ఈ రైల్వే చార్జీల పెంపుతో కేంద్రానికి రూ. 6,600కోట్ల ఆదాయం రానుంది.