ఇక వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: డిసిసి
నిజామాబాద్,మే25(జనంసాక్షి): 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం
ఖాయమని డిసీసీ అధ్యక్షుడు తాహిర్‌బిన్ ధీమా వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వస్తే.. నిరుద్యోగులకు రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తామని హావిూ ఇచ్చారు. నాగులేళ్ల పాలనలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హావిూని నెరవేర్చలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరికో ఒక ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రజలకు భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలతో కాలం గడుపుతున్నాయన్నారు. ఆ ప్రభుత్వాల తమ నాలుగేళ్ల పాలనలో ప్రజలు ఎంతో కోల్పోయారని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర దక్కలేదని తెలిపారు. ఖమ్మంలో రైతులు కనీసం మద్దతు ధర కల్పించాలని ధర్నా చేస్తే బేడీలు వేసి ఉగ్రవాదుల్లాగా జైళ్లొ పెట్టారని విమర్శించారు. ప్రజలను కులాల వారీగా విభజిస్తూ వారికి యూనిట్లు కేటాయించి కుల వృత్తులే చేసుకొమ్మని, ఆయా కులస్థులు అభివృద్ధి చెందకుండా చేస్తున్నారని విమర్శించారు. ఎంతమంది దళితులకు మూడెకరాల భూమి పంచారో తెలపాలని ప్రశ్నించారు.