ఇజ్రాయెల్ మహిళలపై దాడులు చేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారు?
` మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం
టెల్ అవీవ్(జనంసాక్షి):హమాస్ ఉగ్రదాడికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ, మహిళా హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆయా సంస్థలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ మహిళలపై హమాస్ ఉగ్రవాదులు ఆత్యాచారాలకు పాల్పడినప్పుడు విూరంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తమ దేశంలో జరిగిన అమానవీయ ఘటనల గురించి ఐక్యరాజ్య సమితి ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియోను విడుదల చేశారు.’’మహిళా హక్కుల సంస్థలు, మానవ హక్కుల సంస్థలకు నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. ఇజ్రాయెల్ మహిళలు ఆత్యాచారానికి గురైనప్పుడు, వారిపై భౌతిక దాడులు జరిగినప్పుడు విూరు ఎక్కడ ఉన్నారు? వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రపంచ దేశాల నాయకులు, ప్రభుత్వాలు ఈ దారుణాలకు వ్యతిరేకంగా మాట్లాడాలి. శారీరక వేధింపులతో ఇజ్రాయెల్ మహిళలు చేసిన ఆక్రందనలు, తల్లిదండ్రులను కోల్పోయి భయంతో బతుకున్న చిన్నారుల గురించి ఏ హక్కుల సంస్థలూ మాట్లాడలేదు. కానీ, గాజాపై ఇజ్రాయెల్ దారుణాలకు పాల్పడుతోందని, యుద్ధాన్ని త్వరగా ముగించాలని సూచిస్తున్నారు. విూరంతా యుద్ధం తర్వగా ముగియాలని కోరుకుంటే.. ఇజ్రాయెల్ పక్షాన నిలవండి. హమాస్‌ను అణచివేయడమే యుద్ధాన్ని ముగించేందుకు ఉన్న ఏకైక మార్గం’’ అని నెతన్యాహు తెలిపారు.మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య దీర్ఘకాల కాల్పుల విరమణపై అమెరికా, ఖతార్, ఈజిప్టు చర్చలు జరుపుతున్నాయి. అయితే.. మరోసారి తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరే అవకాశముందని తెలుస్తోంది. శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తేనే మిగిలిన బందీలను విడుదల చేస్తామని హమాస్ నిబంధన పెట్టింది. దీనిపైన చర్చలు సాగుతున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి, సుమారు 240 మందిని గాజాకు బందీలుగా తీసుకెళ్లారు. ఇటీవల తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు. హమాస్ ఉగ్రవాదుల వద్ద ఇంకా 137 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.