ఇడి కేసులకు లొంగి భయపడేది లేదు
బిజెపికి వ్యతిరేకంగా తమపోరాటం కొనసాగిస్తాం
ప్రజాస్వామ్యాన్నికాపడుకోవడమే మా లక్ష్యం
యంగ్ ఇండియాకు సీల్‌పై రాహుల్
న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): ఇడి కేసులు, బెదరింపులకు లొంగేది లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయాన్ని ఈడీ సీల్ చేసిన అనంతరం మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ విమర్శలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు బీజేపీ అణిచివేత ఎత్తుగడల్లో భాగమని, కాషాయ పార్టీకి తాము భయపడ బోమని రాహుల్ స్పష్టం చేశారు. బీజేపీ ఏం చేసినా తాము బెదిరేది లేదని అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తన పోరాటం కొనసాగుతుందని గురువారం పేర్కొన్నారు. తమపై ఒత్తిడి తీసుకువస్తే మౌనం దాల్చుతామని కాషాయ పాలకులు అనుకుంటున్నారని, తాము మౌనం దాల్చబోమని బీజేపీ దుర్నీతిని ఎండగడుతూనే ఉంటామని అన్నారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈడీ బుధవారం సీల్ వేసిన నేపధ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా నేషనల్ హెరాల్డ్‌పై ఈడీ దాడులను కాంగ్రెస్ తప్పుపట్టింది. వాస్తవ అంశాలను మరుగునపరిచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వి దుయ్యబట్టారు. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడీ దాడుల నేపధ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ అన్నింటినీ సీల్ వేసే ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. ఇలాంటి చవకబారు ఎత్తుగడలతో కేంద్రం తమ గొంతులను నొక్కలేదని సింఘ్వి పేర్కొన్నారు. విపక్షంగా తమ బాధ్యత నుంచి తాము ఎప్పుడూ పక్కకు తప్పుకోబోమని స్పష్టం చేశారు. విూరు ఎంతగా తమను అణిచివేయాలని చూసినా విూ తప్పిదాలను బయటపెడుతూనే ఉంటామని అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కక్షపూరిత రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడటం ప్రజాస్వామ్య విధానం కాదని, తాము ఎక్కడికి పారిపోవడం లేదని వారు గుర్తుపెట్టుకోవాలని అన్నారు.