ఇది చారిత్రాత్మక విజయం
– జంటనగరాల ప్రజలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా
– ఇష్టపడి ఇచ్చిన తీర్పు
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి 5(జనంసాక్షి): ప్రజలు ఇష్టంతో ఇచ్చిన తీర్పుతోనే గ్రేటర్‌లో ఘన విజయం సాధించగలిగామని ముఖ్యమంత్రి కెసిఆర్ విశ్లేషించారు. ఇవి కష్టపడితే వచ్చిన ఫలితాలు కావని అన్నారు. కష్టపడితే ఇంత భారీ విజయం రాదన్నారు. ప్రజలు టిఆర్‌ఎస్‌ను తమదిగా భావించి ఇష్టంతో గెలిపించారని అన్నారు. ఫళితాలు వెల్లడయ్యాక అయన పార్టీ నేతలు కె,కేశవరావు, డిప్యూటి సిఎం మహ్మూద్ అలీ తదితరులతో కలసి తెలంగాణ భవన్‌లో విూడియాతో మాట్లాడారు. ఇచ్చిన హావిూ మేరకు అన్ని సమస్యలను
పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గత ఎన్నికల రికార్డులను చెరిపేస్తూ గ్రేటర్ ప్రజలు తెరాసకు చారిత్రక విజయం కట్టబెట్టారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ విజయం మంత్రులు, తెరాస నేతలు, కార్యకర్తల సమష్టి కృషి ఫలితమేనన్నారు. నగర చరిత్రలో ఏ ఒక్కపార్టీ కూడా స్వయంగా అధికారం చేపట్టిన దాఖలాలు లేవని… కానీ ఈ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు అద్భుత అవకాశం ఇచ్చారన్నారు. ఈ గెలుపుతో ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజల రుణం తప్పకుండా తీర్చుకుంటామని స్పష్టం చేశారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల చరిత్రలో ఇంత మెజార్టీ ఏ పార్టీకి రాలేదు. సింగిల్‌గా అధికారం ఏ పార్టీ చేపట్టలేదు. గతంలో ఏపార్టీకి 52 సీట్లకు మించి రాలేదు. గెలుపు కోసం శ్రమించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గెలిచామని ఎవరికి అహం రావొద్దన్నారు. అలాగే లంచం లేకుండా పనులు జరిగే రోజు రావాలన్నరు. అందుకు మంత్రులు, కౌన్సిలర్లు కృషి చేయాలన్నారు. అందుకే తాము అభివృద్దిలో ఇకముందు పద్ధతిగా పని చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలో ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఆశపెట్టుకున్నారని, వారికోసం లక్ష ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలను వందశాతం అమలుచేస్తామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక తెరాసపై విమర్శలు చేసిన వారికి ఈ ఫలితాలు చెంపపెట్టు లాంటివన్నారు. తెలంగాణ ప్రజలే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలైన వారంతా టిఆర్‌ఎస్‌ను నమ్మి గెలిపించారని అన్నారు. డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణం, రెండు రిజర్వాయర్ల నిర్మాణం హావిూలను వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. నగరంలో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఉక్కుపాదంతో వ్యవహరిస్తామని అన్నారు. స్కై వంతెనలు, సిగ్నల్ ఫ్రీ కూడళ్లు, మంచినీటి సరఫరా తదితర హావిూలను నెరవేరుస్తామన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు అనుబంధంగా నగరంలో మరో వెయ్యి పడకల సామర్థ్యం గల మూడు ఆస్పత్రులను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. శివారు ప్రాంతాల ప్రజల అవసరాలకు అనుగుణంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించి ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. కూరగాయల మార్కెట్లు, స్మశాన వాటికల నిర్మాణం, బస్‌బేలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం తదితర హావిూలన్నింటినీ అమలు చేస్తామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంలో తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. హైదరాబాదీలంతా తమ బిడ్డలేనని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను అందరూ పిడికిలెత్తి గెలిపించారు. వారందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా హైదరాబాదీలే.. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళతో పాటు ఆంధ్రా ప్రాంత సోదరులకు గొప్ప సదుపాయాలు కల్పిస్తాం. వీరందరికి రక్షణ కల్పిస్తామని ఉద్ఘాటించారు. ఏ ఒక్కరు అభద్రత భావానికి లోను కాకూడదని చెప్పారు. జంట నగరాల ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ ప్రజలు చరిత్ర తిరగరాస్తూ తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు. గ్రేటర్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని స్పష్టం చేశారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావుకు, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఇది ఏ ఒక్కరి కృషి కాదని, అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే
విజయం సాధ్యమైందని తెలిపారు.
ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి
ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయని… వాటన్నింటినీ ప్రజలు తిప్పికొట్టారని కేసీఆర్ అన్నారు. కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా అన్ని వర్గాలు తెరాసకు పట్టం కట్టారన్నారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విపక్షాలకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి వంద సీట్లు వస్తే చెవి కోసుకుంటానన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.నారాయణ తనకు దగ్గరి స్నేహితుడు. మనకు ఒక చెవి నారాయణ వద్దు. రెండు చెవుల నారాయణ కావాలి. ఆయన చెవుల వద్దకు ఏవరూ పోవద్దు. ఇలాంటి వ్యాఖ్యలు స్పోర్టివ్‌గా తీసుకోవాలని నారాయణ చెప్పినట్లు ఎలక్టాన్రిక్ విూడియాలో విన్నాను. నేను కూడా నారాయణ వ్యాఖ్యలను స్పోర్టివ్‌గా తీసుకుంటున్నానని సీఎం కేసీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జర్నలిస్టు మిత్రులు మాకే ఓటేశారు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో విజయం ఏ ఒక్కరి వల్లనో కాలేదు. అందరి కృషి వల్లే విజయం సాధ్యమైంది. మొన్న నేను చెప్పినట్లు జర్నలిస్టులు మాకు ఓటేశారు. విజయంలో జర్నలిస్టుల పాత్ర కూడా ఉందన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.