ఇది యూపీఏ కాదు: రాజ్, రాజేకు సంతకం చిక్కు

న్యూఢిల్లీ: ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, ఎన్డీయే సర్కార్ అని, యూపీఏ మంత్రులు చేసినట్లుగా తమ మంత్రులు ఎవరూ తప్పులు చేయరని, అందువల్ల వారు రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్‌లు బుధవారం స్పష్టం చేశారు. యుపిఏ మంత్రులు చేసినవన్నీ తమ మంత్రులు చేయరని చెప్పారు. లలిత్ మోడీ వ్యవహారం, నకిలీ డిగ్రీల వివాదంపై కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, వసుంధర రాజే, స్మృతి ఇరానీలు రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ను ప్రభుత్వం బుధవారం తోసిపుచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, ఎన్డీఏ ప్రభుత్వమని కాంగ్రెస్‌కు చురక అంటించారు. వివాదాలు ఎదుర్కొంటున్నందున ముగ్గురు కీలక నేతలు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నప్పుడు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎలా సాఫీగా సాగుతాయని విలేకరులు ప్రశ్నించారు. దానికి వారు పై విధంగా స్పందించారు.  మరింత చిక్కుల్లో వసుంధర రాజే వివాదాస్పద చరిత్ర ఉన్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్‌కు సమర్థనగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సంతకం చేసినట్లు చెబుతున్న ఓ పత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది. తద్వారా లలిత్ మోడీ వ్యవహారంలో వసుంధర రాజే మరింతగా ఇరుక్కున్నారు. ఆయనకు అనుకూలంగా ఇమిగ్రేషన్ పత్రాలపై వసుంధర సంతకం చేసినట్టుగా ఉన్న పత్రాలను కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసింది. లలిత్ మోడీ ఇమిగ్రేషన్ వ్యవహారంలో వసుంధరకు సంబంధం ఉందంటూ తాము చేసిన ఆరోపణలకు రుజువులివిగో అంటూ ఈ పత్రాల్ని విడుదల చేసింది. తక్షణమే ఆమెను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. రాజస్థాన్‌లో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు వసుంధర సంతకం చేసిన ఏడు పేజీల అఫిడవిట్‌ను కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ మీడియా సమావేశంలో బయట పెట్టారు. లలిత్ మోడీ చేసుకున్న ఇమిగ్రేషన్ అభ్యర్థనను వసుంధర రాజే బలపరిచారన్న విషయాన్ని ఈ పత్రాలు తిరుగు లేకుండా రుజువుచేస్తున్నాయన్నారు. మొదట్లో ఈ పత్రాల గురించే తనకు తెలియదని వసుంధర చెప్పారని, తర్వాత తనకు గుర్తు లేదన్నారని పేర్కొన్నారని జైరామ్ రమేష్ అన్నారు. ఇప్పుడు అంతా బయట పడిందని, జరిగిందేమిటో ప్రజలకు తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. లలిత్ మోడీ చేసే ఇమిగ్రేషన్ అభ్యర్ధనకు మద్దతుగా ఈ ప్రకటన చేస్తున్నానని, అయితే లలిత్‌కు నేను సహాయ పడ్డానన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ భారత అధికారులకు తెలియకూడదని షరతు పెడుతున్నానని వసుంధర ఆ పత్రంలో పేర్కొన్నట్లుగా ఉంది. ఆ అఫిడవిట్‌లు వసుంధర సంతకంతోనే బయటకు వచ్చాయని, అందులోని ఆమె సంతకాలు ఎంత మాత్రం నకిలీవి కాదని జైరాం రమేష్ పేర్కొన్నారు. అయితే, ఆ పత్రాల పైన బీజేపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. రాజే ప్రతిష్టను మసకబార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని రాజస్థాన్ నేత అసోక్ పర్నామీ అన్నారు.