ఇది సూటు బూటు సర్కారు

1

– భూ సేకరణ బిల్లుపై ఎందుకంత తొందర?

– బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం రైతులను పణంగా పెడుతున్నారు

– రాహుల్‌

న్యూఢిల్లీ,మే12(జనంసాక్షి): ఇది సూటూ,బూటు సర్కార్‌ అని సర్కార్‌ ఆటలు చెల్లనివ్వమని,యూపీఏ ప్రభుత్వం రెండేళ్లు కష్టపడి తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని ఎన్టీయే ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే నీరుగార్చిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. భూసేకరణ చట్టంపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్టీయే ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా మారిందన్నారు. ప్రస్తుత భూసేకరణ చట్టం సంపన్నులకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉందన్నారు. అందుకే ఈ బిల్లు కోసం తొందరపడుతోందన్నారు.  భూసేకరణ బిల్లు పాస్‌ కానివ్వబోమని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. భూసేకరణ బిల్లుపై ఏకాభిప్రాయ సాధన కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదని ఆయన లోక్‌ సభలో ఆరోపించారు. యూపీఏ తెచ్చిన బిల్లును ఎన్డీఏ సర్కారు ఖూనీ చేసిందని వాపోయారు. బిల్లును ఆమోదింప జేసుకునేందుకు మోదీ సర్కారు హడావుడి చేస్తోందన్నారు. భూస్వాముల కోసమే ఈ బిల్లు తెచ్చారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను ఎన్డీఏ సర్కారు బేఖాతరు చేస్తోందని ధ్వజమెత్తారు. రైతుల భూములను ఎన్డీఏ సర్కారు కాజేస్తోందని మండిపడ్డారు. ఆరునూరైనా బిల్లు ఆమోదింప జేయనీయమని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. లోక్‌సభలో భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై ఇవాళ వాడీవేడీ చర్చ జరిగింది.  ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విపక్ష సభ్యులు దుమ్మెత్తి పోస్తోన్నారు. ఈ బిల్లుపై  రాహుల్‌ గాంధీ విమర్శలు కురిపించారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులో రైతు ప్రయోజనాలకు విరుద్దంగా మార్పులు చేశారని దుయ్యబట్టారు. గతంలో యూపీఏ ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టినపుడు అద్వానీ, సుష్మా స్వరాజ్‌ బల్లలు చరిచారని గుర్తు చేశారు. ఈ బిల్లును ఆమోదింప జేసేందుకు ఎన్డీఏ సర్కారు తొందరపడుతోందని అన్నారు. రైతులకు భూమి బంగారంతో సమానమని అలాంటి భూమిని వారికి ఇష్టం లేకుండా ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. సూటు, బూటు పనులను ఇకపై సాగనీయబోమని హెచ్చరించారు. ఇదిలావుంటే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని బీజేపీ ఎంపీ దిలీప్‌ సింగ్‌ ఉద్ఘాటించారు. బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యుడు రాహుల్‌ గాంధీ ప్రభుత్వం చేసిన విమర్శలను ఆయన తిప్పి కొట్టారు. గత 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో రైతులకు ఎంతో అన్యాయం జరిగిందని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోనే దేశం ప్రగతి పథంలో నడుస్తుందని తెలిపారు.