ఇదొక చెత్త ప్రదర్శన

– మేము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది
– కివీస్‌ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు
– టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ
హామిల్టన్‌, జనవరి31(జ‌నంసాక్షి) : న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో ఘోర పరాజయం చెందడం పట్ల టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఇంతటి ఘోర వైఫల్యాన్ని ఊహించలేదని పేర్కొన్న రోహిత్‌..  ఇదొక చెత్త ప్రదర్శన అని అన్నాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన రోహిత్‌.. ‘ సుదీర్ఘ కాలం తర్వాత భారత్‌ చవి చూసిన అత్యంత చెత్త ప్రదర్శనల్లో ఇదొకటని, ప్రధానంగా బ్యాటింగ్‌లో ఘోరంగా వైఫల్యం చెందామన్నారు. ఈ తరహా ఆటను ఊహించలేదని, ఇక్కడ క్రెడిట్‌ అంతా న్యూజిలాండ్‌ బౌలర్లదేనన్నారు. వారు అద్భుతమైన బౌలింగ్‌తో మమ్మల్ని కట్టడి చేశారని రోహిత్‌ తెలిపారు.
ఇది మా జట్టుకు ఒక గుణపాఠమని, ముఖ్యంగా స్వింగ్‌ అయ్యే పిచ్‌లపై బ్యాటింగ్‌ ఎలా చేయాలనేది మ్యాచ్‌ తర్వాత మా ఆటగాళ్లకు కచ్చితంగా బోధపడుతుందని పేర్కొన్నారు. ఇక్కడ మమ్మల్ని నిందించుకోక తప్పదని, ఒత్తిడికి గురై వికెట్లను సమర్పించుకున్నామని తెలిపారు. చెత్త షాట్ల ఎంపికతో కివీస్‌కు దాసోహమయ్యామని, ఒత్తిడికి లోను కాకుండా కనీసం పోరాటాన్ని కనబరిచి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి కావని, బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు ఆడటం అనేది ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే అన్నారు. మమ్మల్ని మేము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతీఒక్క ఆటగాడు ఎక్కడ తప్పు చేశాడో అనే విషయాన్ని విశ్లేషించుకోవాలని రోహిత్‌ తెలిపాడు.