ఇన్ఫోసిస్‌కు విశాల్‌సిక్కా రాజీనామా

బెంగుళూరు,ఆగష్టు 18(జనంసాక్షి): దేశీయ రెండో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ పదవి నుంచి విశాల్‌ సిక్కా తప్పుకొన్న తీరుపై బ్లాగ్‌ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. తాను ఎందుకు రాజీనామా చేస్తున్నదీ సిక్కా తన బ్లాగులో రాసుకొచ్చారు. ఇటీవల నిరాధారమైన ఆరోపణలతో తనపై వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయని.. ఇలాంటి సమయంలో సీఈవోగా తాను కొనసాగలేనని సిక్కా అందులో పేర్కొన్నారు. అయితే ఇన్ఫో వ్యవస్థాపక చైర్మన్‌ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా సిక్కాను రాజీనామాకు పురిగొల్పి ఉంటాయని భావిస్తున్నారు. అంతేగాక భవిష్యత్తులో ముందుకెళ్లేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన రాజీనామాకు గల కారణాలను ‘మూవింగ్‌ ఆన్‌’ పేరుతో సిక్కా తన బ్లాగులో పేర్కొన్నారు. ‘ఎంతో ఆలోచించిన తర్వాత నేను సీఈవో, ఎండీ పదవికి రాజీనామా చేశాను. గడిచిన మూడేళ్లలో ఎంతో సాధించాం. కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాం. అయితే గత కొన్ని రోజులుగా నాపై వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయి. అవన్నీ నిరాధారమే. అయితే ఆరోపణలతో నేను సీఈవోగా కొనసాగలేను. అందుకే రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నాను’ అని సిక్కా పేర్కొన్నారు. స్టీవ్‌ జాబ్స్‌ చెప్పినట్లు.. నేను నా మనస్సును, నా కలలనే ఫాలో అవుతాను. ఇప్పుడు నేను ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. ఎక్కడైతే మర్యాదపూర్వకమైన, నమ్మకమైన వాతావరణం ఉంటుందో అక్కడికి తిరిగి వెళ్తున్నాను. అక్కడ కొత్త సవాళ్లను స్వీకరిస్తాను. అంతేగాక, నా ప్రియమైన కుటుంబసభ్యులతోనూ నేను సమయం గడపాలనుకుంటున్నాను. చాలా కాలంగా నేను నా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ మూడేళ్ల కాలంలో ఎప్పుడైనా బాధపడ్డారా అని నన్ను చాలా మంది అడిగారు. దానికి ఇప్పుడు సమాధానం చెబుతున్నాను. ఒక్క క్షణం కూడా నేను బాధపడలేదు. సమస్యలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్లాను. ఇన్నాళ్ల పాటు నాకు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు’ అని సిక్కా బ్లాగులో రాశారు. తనపై నారాయణమూర్తి చేసిన ఆరోపణల కారణంగానే సిక్కా వైదొలిగినట్లు ఇన్ఫోసిస్‌ వర్గాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం.

కార్పోరేట్‌ రంగంలో సంచలనం

ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ బాధ్యతలకు విశాల్‌ సిక్కా రాజీనామా చేయడం.. భారత కార్పొరేట్‌ రంగంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి.. విశాల్‌సిక్కా సీఈవోగా పనికిరారని ఓ ఈమెయిల్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.సీఈవో కంటే సీటీవో పదవే విశాల్‌సిక్కాకు సరిపోతుందని బోర్డులోని పలువురు స్వతంత్ర డైరెక్టర్లు తనతో అన్నట్లు నారాయణమూర్తి ఆగస్టు 9న ఓ ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు విూడియాలో వార్తలు వచ్చాయి. ‘రవి వెంకటేశన్‌(కో-ఛైర్మన్‌)తో సహా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు విశాల్‌ సిక్కా గురించి తనకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. సిక్కాలో సీఈవో లక్షణాలు లేవని.. సీటీవో(చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌) లక్షణాలు ఉన్నాయని వారు నాతో అన్నారు. బోర్డులోని కనీసం ముగ్గురు డైరెక్టర్ల అభిప్రాయం ఇదే. ఇది నా అభిప్రాయం మాత్రం కాదు.’ అని ఈమెయిల్‌లో మూర్తి పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ మెయిల్‌లోని ఆరోపణలను కంపెనీ ధ్రువీకరించలేదు. కాగా.. దీని అనంతరం నారాయణమూర్తి మరో ఈ మెయిల్‌ రాశారు. ‘విశాల్‌ సిక్కాపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయనతో సమయాన్ని గడపడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన పనితీరుపై నేను ఎప్పుడు వ్యాఖ్యానించలేదు. ఇన్ఫోసిస్‌ పాలనపైనే నా బాధ అంతా ప్రస్తుత బోర్డులో లోపాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను.’ అని మూర్తి మరో మెయిల్‌లో పేర్కొనడం గమనార్హం.ఇన్ఫోసిస్‌ పరిణామాలు ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపాయి. అలాగే స్టాక్‌ మార్కెట్లను కూడా ఓ కదుపు కుదిపింది. దేశీయ రెండో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ బాధ్యతల నుంచి విశాల్‌ సిక్కా తప్పుకోవడంతో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేరు విలువ దాదాపు 7శాతం వరకూ పడిపోయింది. దీంతో ఒక్క గంటలోనే కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ నుంచి రూ. 16వేల కోట్లు ఆవిరయ్యాయి. కంపెనీ డాక్యుమెంట్ల ప్రకారం.. జూన్‌ 30 నాటికి కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 2.1లక్షల కోట్లుగా ఉంది. అయితే సిక్కా రాజీనామా చేయడంతో కంపెనీ షేర్లు నష్టాల బాట పట్టాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీలో షేరు విలువ రూ. 953కు పడిపోయింది. దీంతో గంటలోనే రూ. 16వేల కోట్ల క్యాపిటలైజేషన్‌ ఆవిరైంది. ట్రేడింగ్‌ ఆరంభానికి కొద్ది నిమిషాల ముందే కంపెనీ బీఎస్‌ఈకి సిక్కా రాజీనామా విషయాన్ని పంపించింది. దీంతో ఆరంభం నుంచే ఇన్ఫీ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఇన్ఫీ షేర్లు పడిపోవడం స్టాక్‌మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. గత మూడు సెషన్లలో లాభాల్లో సాగిన సూచీలు.. ఈ ఉదయం నుంచి నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 232 పాయింట్లు కోల్పోయి 31,563 వద్ద, నిప్టీ 57 పాయింట్ల నష్టంతో 9,847 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా. మరో దిగ్గజ సంస్థ టీసీఎస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ఒడిదుడుకుల మధ్య సాగి స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకపు విలువ 64.14 వద్ద కొనసాగుతోంది.