ఇప్పటికైతే కొత్త కరోనా రాలేదు
కరోనా కొత్త రకం’ భారత్‌లో లేదు
అయినా జాగ్రత్త తప్పదన్న ఆరోగ్యశాఖ
దిల్లీ,డిసెంబరు 22 (జనంసాక్షి):బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ ప్రభావం ఇప్పటికైతే మనదేశంలో లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త వైరస్ ప్రభావంపై విశ్లేషణ జరుగుతోందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని తెలిపింది. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది.దేశంలో కరోనా తాజా పరిస్థితులను కేంద్ర ఆరోగ్య శాఖ నేడు వివరించింది. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. ‘ యూకేలో బయటపడిన కరోనా కొత్త రకం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అయితే దీని వల్ల కొవిడ్ వైరస్ తీవ్రతపై, మరణాల రేటుపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు. వ్యాక్సిన్ సమర్థతపై కూడా దీని ప్రభావం ఉండబోదు. దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికైతే ఈ కొత్త వైరస్ ప్రభావం మనదేశంలో లేదు. కానీ, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త వైరస్ ప్రభావంపై విశ్లేషణ జరుగుతోంది. వైరస్ జీనోమ్ వ్యవస్థపై అధ్యయనం చేస్తాం’ అని తెలిపారు. బ్రిటన్‌లో కొత్తరకం వైరస్ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి నుంచి డిసెంబరు 31 వరకు యూకేకు విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆలోగా వచ్చిన వారికి ఎయిర్‌పోర్టుల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. కాగా.. సోమవారం రాత్రి నుంచి యూకే నుంచి వచ్చిన పలువురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ఇది కొత్త రకమా? కాదా అనేది తెలియరాలేదు. దీంతో పాజిటివ్ వ్యక్తుల నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. మరోవైపు కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక భారత్‌లో గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ తెలిపారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు కూడా 3శాతానికి దిగువనే ఉన్నాయన్నారు. ‘దాదాపు ఐదున్నర నెలల తర్వాత దేశంలో యాక్టివ్ కేసులు 3లక్షల కంటే తక్కువగా ఉన్నాయి. గత ఏడు వారాలుగా రోజువారీ కొత్తకేసులు కూడా తగ్గుతున్నాయి. గత ఏడు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది లక్షల జనాభాకు సగటున 588 కొత్త కేసులు నమోదవతుండగా.. భారత్‌లో ఈ సంఖ్య 124గా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మిలియన్ జనాభాకు 10 మరణాలు చోటుచేసుకుంటుండగా.. భారత్‌లో ఇద్దరు మరణిస్తున్నారు’ అని రాజేశ్ వెల్లడించారు. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్రియాశీల కేసులు 10వేల కంటే తక్కువగానే ఉన్నాయని చెప్పారు.