ఇప్పటికైనా దర్యాప్తు సంస్థలను పటిష్ఠం చేయండి 

ఆలస్యంగా అయినా సిబిఐ పరువు నిలిపే ప్రయత్నంలో కేంద్రం తీసుకున్న చర్యలు అభినందనీయం. ప్రస్తుత డేరెక్రట్‌ అలోక్‌ వర్మను, ఆస్థానాను తప్పించి నాగేశ్వర రావుకు తాత్కాలిక బాధ్యతలు అప్ప గించడం ద్వారా దేశ ప్రతిష్ట మరింత దిగజారకుండా చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలో అవినీతి చోటు చేసుకోవడం ద్వారా భారత ప్రతిష్టను మసకబార్చారు. అత్యుతన్న పీఠంగా ఉండాల్సిన సంస్థలో రాజకయీ జోక్యం ఎప్పటి నుంచో ఉన్నా ఇంతగా దిగజారిన దాఖలాలు లేవు. నిజాయితీ లేని అధికారులను ఇందులో నియమించడం ద్వారా కేంద్రం దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లేలాల చేసింది. నిజానికి కేంద్రం ఆధీనంలోని సిబిఐ, విజిలెన్స్‌, ఐబి, రా వంటి దర్యాప్తు సంస్థలను పటిష్టంగా ఉంచాలి. వాటిని రాజకీయాలకు అతీతంగా పటిష్టం చేయాలి. వాటంతట అవి సమర్థంగా పనిచేసేలా అందులో రాటుదేలిని అభ్యర్థులను చేర్చాలి. కానీ అలా జరగడం లేదు. కాంగ్రెస్‌ హయాంలో ఈ సంస్థలను దిగజార్చారు. వాటిని రాజకీయ స్వప్రయోజ నాలకు ఉపయోగించుకున్నారు. దీంతో తాజా ఘటనలను అందుకు పరాకాష్టగా చూడాలి. సీబీఐ అధినాయ కత్వంలో అంతర్యుద్దం అన్నది దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందన్న జ్ఞానం అధికారులకు లేకపోవడం దారుణం కాక మరోటి కాదు. ఈ రచ్చ కోర్టుకెక్కడం మరింత దిగజారింది. అవినీతి కేసులో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా మంగళవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, ఈ నెల 29 వరకూ ఆస్థానాపై చర్యలు తీసుకోకుండా న్యాయస్థానం స్టే విధించడం, మరోవైపు ఆస్థానా అధికారాలకు సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ కత్తెర వేయడం,కేసుల దర్యాప్తులో ఆయన జోక్యానికి బ్రేకులు వేయడం అంతా గందరగోళంగా సాగిపోయింది. ఈ దశలో వర్గ పోరుతో పరువు కోల్పోయిన కేంద్ర దర్యాప్తు సంస్థలో ప్రక్షాళనకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రస్తుత డైరెక్టర్‌ అలోక్‌వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాలను కేంద్రం విధుల నుంచి తప్పించింది. వారిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఉన్నత వర్గాలు మౌఖిక ఆదేశాలు జారీచేశాయి. సీబీఐ నూతన డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావు నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. తక్షణ విధుల్లో చేరాలని ఉత్వర్వుల్లో పేర్కొనడంతో నాగేశ్వరరావు వెంటనే బాధ్యతలు చేపట్టారు. ఇకపోతే సిబిఐ వర్గపోరుకు సంబంధించిన వ్యవహారంలో అరెస్టయిన సీబీఐ డీఎస్పీ దేవేందర్‌ కుమార్‌ కూడా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఎలాంటి ఉపశమనం దక్కలేదు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడు రోజుల రిమాండ్‌ విధించింది. ఈ మొత్తం వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను కలసిన అలోక్‌ వర్మకు స్పష్టంచేశారు. నిఘా సంస్థ ‘రా’ అధికారి సమంత్‌ గోయెల్‌ పేరు కూడా ఈ కేసులో వెలుగుచూడటంతో ఆ సంస్థ అధిపతి అనిల్‌ దస్మానాతోనూ మోదీ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే దర్యాప్తు సంస్థలు అవినీతి కేంద్రాలుగా మారడం వల్ల విదీశీయుల దృష్టిలో మనం ఎంతగా పరువు కోల్పోతామో గమనించడం లేదు. నీతి, నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయతకు మారు పేరుగా నిలవాల్సిన అత్యున్నత కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సిబిఐ) రాజకీయ ఆశ్రిత పక్షపాతం, అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోనే అత్యున్నతమైన ఈ దర్యాప్తు సంస్థలో ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు సిబిఐ విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసాయి. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన సిబిఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ అస్తానా ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు చాలా తీవ్రమైనవి. వృత్తి నైపుణ్యం, సామర్థ్యం ప్రాతిపదిక కాకుండా తనకు నచ్చిన వారిని, కళంకితులను ఉన్నత స్థానాల్లోకి చొప్పించి ఈ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ హయాంలో మొదలైన ప్రయత్నాలు మోడీ హయాంలో కూడా కొనసాగాయి. చాలా కాలంగా ఇలాంటి నియామకాల కారణంగా సంస్థ ప్రతిష్ట బజారున పడింది. రాజ్యాంగం పైన, రాజ్యాంగ విలువల పైన, పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంస్థలపైన వీసమెత్తు కూడా గౌరవం లేని నేతలు ప్రధానులు కావడంతోనే సిబిఐ తాబేదారు సం/-థగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనిని సంస్కరించకుండా మరింతగా దిగజార్చింది. ఇందిర హయాం నుంచే పాలకపార్టీ ప్రత్యర్థులను వేధించ డానికి సిబిఐని ఒక పావుగా కేంద్రం వాడుకుంటున్నది. అధికారంలో ఉన్న పెద్దల కనుసన్నల్లో దర్యాప్తులు సాగుతున్నాయి. వ్యతిరేకులను లోపలేయడం కోసంమాత్రమే సిబి పనిచేస్తుందా అన్న రీతిలో కేసుల తీరు ఉంటోంది. ఇలా చేయడం అలవాటు చేసుకున్న సిబిఐకి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్పు వస్తుందని భావించడానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ కంటే భిన్నంగా మోడీ ఉంటారను కున్నా.. ఉండలేక పోతున్నారు. తనకు నమ్మిన బంటుగా వున్న గుజరాత్‌ కేడర్‌ ఐపిఎస్‌ అధికారి రాకేష్‌ అస్తానాను మోడీ ఏరి కోరి తెచ్చుకుని సిబిఐలో పెద్ద పీట వేయడంతోనే ఆయనకూ లక్ష్యాలు ఉన్నాయని అర్థం అయ్యింది. సిబిఐ స్పెషల్‌ డైరక్టర్‌గా పదోన్నతి కల్పించేటప్పటికి అస్తానాపై అరడజనుకు పైగా అవినీతి కేసులు నమోదై ఉన్నాయి. సిబిఐ డైరక్టర్‌ అలోక్‌ వర్మ ఈ విషయాన్ని లేఖ రూపంలో సివిసి దృష్టికి తీసుకెళ్లారు. అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న అధికారిని మోడీ సర్కార్‌ సిబిఐ ప్రత్యేక డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించడంతో ఇప్పుడు పాపం పండి వ్యవహారం బయటపడింది. ఆలస్యంగా అయినా వారిద్దరినీ తప్పిండం ద్వారా పరువు కాపాడారు. ఇది మరింతగా రచ్చకెక్కకుండా చేశారు. ఇకనైనా సంస్థను పటిష్టం చేస్తే మంచిది.