ఇప్పట్లో ధోనీ రిటైర్మెంట్ ఆలోచన ఏవిూలేదు
– ఆ బంతిని బౌలింగ్ కోచ్ కు చూపించేందుకే తీసుకున్నాడు
– ధోని రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రవిశాస్త్రి
లీడ్స్, జులై19(జనం సాక్షి) : భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇంగ్లాండ్‌తో చివరి వన్డే అనంతరం ఫీల్డ్ అంపైర్ల నుంచి మ్యాచ్ బంతిని తీసుకోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేయబోతున్నాడా? త్వరలోనే అతడి నుంచి ప్రకటన రాబోతోందా? అని అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. దీనిపై తాజాగా భారత జట్టు కోచ్ స్పందించారు. ఇప్పట్లో ధోనీ రిటైర్మెంట్ ఆలోచన ఏవిూలేదని తేల్చి చెప్పాడు. తాజాగా రవిశాస్త్రి విూడియాతో మాట్లాడుతూ.. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడం లేదని ఆ వార్తలన్నీ అవాస్తవమని, అతను ఎక్కడికీ వెళ్లడన్నారు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో చివరి వన్డే అనంతరం ధోనీ ఫీల్డ్ అంపైర్లను అడిగి బంతిని తీసుకున్నది నిజమేనని ఆ బంతిని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు చూపించేందుకు మాత్రమే తీసుకున్నాడన్నారు. అంతేకానీ, రిటైర్మెంట్ యోచనలో ఉండి తీసుకోలేదు. భరత్‌కు ఆ బంతిని చూపించి
మ్యాచ్‌లో పడిన ఇబ్బందులు గురించి చర్చించడానికి ధోనీ అలా చేశాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై ఓ అవగాహన కోసమే ధోనీ ఇలా చేశాడు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లోనే ప్రపంచకప్ జరగనుంది. అంతేకాదు త్వరలో ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ కూడా జరగనుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే ధోనీ పరిస్థితులపై బౌలింగ్ కోచ్ భరత్‌తో చర్చించడానికే బంతిని తీసుకున్నాడు’ అని రవిశాస్త్రి తెలిపాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 1 నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం ఐదు టెస్టులు జరగనున్నాయి.