ఇమ్రాన్‌ కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించాలి

పాక్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డా పాత పద్దతులే ఉంటాయనడానికి కాశ్మీర్‌ అంశమే ప్రత్యక్ష ఉదాహరణ. ఆక్రమిత కాశ్మీర్‌ను గుప్పిట్లో పెట్టుకుని పాక్‌ చేస్తున్న ప్రకటనలను తిప్పికొట్టాలి. ముందుగా ఆక్రమిత కాశ్మీర్‌ అంశాన్ని భారత్‌ రచ్చ చేయాలి. ఈ దేశ విభజన ఎందుకు జరిగిందో చెప్పాలి. కాశ్మీర్‌ను పాక్‌ ఎందుకు ఆక్రమించుకుందో నిలదీయాలి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇదో సమస్యగా మారింది. అంతేనా అంటే కాశ్మీర్‌లో హిందువులను తన్ని తరిమివేసి, పండింట్లను ఊచకోత కోసినా మన రాజకీయ నాయకులు కళ్లు తెరవడం లేదు. ఇమ్రాన్‌ ప్రధానిగా బాధ్యతుల చేపట్టినా కొత్త ఆలోచనలు ఉంటాయని అనుకోవడానికి లేదని గుర్తుంచుకోవాలి. ఘర్షణాత్మక వైఖరి విడనాడి సామరస్య సంబంధాలను నెలకొల్పడం పాక్‌ నేర్చుకోవాలి. సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను ఎగతోయడం ఆపాలి. కాశ్మీర్‌తో సహా వాస్తవాధీన రేఖకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి చర్చలే మార్గమని నంగనాచి కబుర్లు చెప్పడం పాకిస్తాన్‌ ఆపాలి. నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమేనని భారత్‌ ఎప్పటినుంచో ప్రకటిస్తూనే ఉంది. చర్చల పక్రియను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను ఇప్పటికైనా గుర్తించి పాక్‌ తన విపరీత ధోరణలును పక్కన పెట్టి ముందుకు రావాలి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగడం వల్ల వాస్తవాధీన రేఖకి ఇరువైపులా వున్న ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే వ్యాపార వాణిజ్య సంబంధాలు వృద్ధి చెందడమే కాదు, సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొంటుంది. దీనికి సైన్యం పెత్తనం పోవాలి. భారత్‌ ఉదారతను అలసుగా తీసుకుని పెట్రేగి పోవడం మానుకోవాలి. ఇది ప్రజలకు మంచిది కాదని పాక్‌ గుర్తుంచుకోవాలి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గితే ఈ రెండు దేశాల మధ్య ఆయుధ పోటీ తగ్గుతుంది. భారీగా పెరిగిపోతున్న రక్షణ వ్యయాన్ని తగ్గించు కోవడం ద్వారా ఆ మొత్తాన్ని పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమని ఇమ్రాన్‌కు రాసిన లేఖలో పేర్కొన్న విషయాన్ని పాక్‌ ప్రభుత్వం సానుకూలంగా తీసుకుని ముందుకురావాలి. ద్వైపాక్షిక చర్చలు పట్టాలపైకి ఎక్కి, సామరస్య పూర్వక సంబంధాలు ఏర్పడాలన్న భావనను పాక్‌ అనుసరించాలి. అదే ఎజెండాగా సాగాలి. ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. మత ఛాందస శక్తులను దరిచేరనీయకుండా ముందుకు సాగడం కోసం ఇమ్రాన్‌ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించాలి. ఘర్షణలు కొనసాగిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించడం వల్లే చర్చల పక్రియ ఆగిపోవడంతో పాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. పాకిస్తాన్‌లో రాజకీయాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా శాసించే సైన్యం, అక్కడి మత ఛాందసవాద శక్తులు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి ప్రయత్నిస్తున్నంత కాలం పాక్‌ పురోగమించదని గుర్తుంచుకోవాలి. పాక్‌ ముందునుంచీ పొరుగు దేశంతో ఘర్షణాత్మక వైఖరికే ప్రాధాన్యమిస్తూ వస్తోంది. భారత్‌-పాక్‌ చర్చల పునరుద్ధరణకు మోడీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలను నిరాకరిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అయిష్టంగానే చర్చలకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా వుంది. గతంలో వాజ్‌ పేయి ప్రభుత్వం పాక్‌ సైనిక అధ్యక్షుడు పర్వేజ్‌ ముషరఫ్‌తో ఆగ్రాలో శిఖరాగ్ర చర్చలు జరిపింది. ఓ మెట్టు దిగి వాజ్‌పేయ్‌ స్నేహ హస్తం సాచారు. కానీ జరిగిందేమిటి? ఆ వెంటనే కార్గిల్‌ యుద్ధం వచ్చింది. పాక్‌ తన కుట్రనలు బహిర్గతం చేసుకుంది. పాముకు పాలు పోసి పెంచామన్న రీతిలో ప్రవర్తించింది. గత అనుభవాల దృష్ట్యా సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం పాక్‌ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. పాకిస్తాన్‌లో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్‌ ఖాన్‌ సైన్యం చేతిలో మనిషి అన్న భావన సర్వత్రా నెలకొని వుంది.

భారత్‌తో సత్సంబంధాలు నెలకొనడం పాకిస్తాన్‌ సైన్యానికి కానీ, అక్కడి మత ఛాందస శక్తులకు కానీ ఎంత మాత్రమూ ఇష్టముండదు. సైన్యం, మతఛాందస వాద గ్రూపుల అభిమతానికి విరుద్ధంగా ఇమ్రాన్‌ ఈ విషయంలో ఎంతవరకు స్వతంత్రంగా వ్యవహరిస్తారన్నది ప్రశ్నార్థకమే. ఎన్ని పరిమితులున్నప్పటికీ భారత్‌, పాక్‌ మధ్య సంబంధాల మెరుగు దలకు చర్చలే ఏకైక మార్గం. ఎప్పటికైనా ఇటువంటి ఊగిసలాట వైఖరికి స్వస్తి చెప్పి భారత్‌తో చర్చల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. చర్చలు ఫలప్రదం కావాలంటే పాక్‌ తన కుట్ర రాజకీయాలను విడనాడాలి. కాశ్మీర్‌ లోయలో ఉగ్రవాదాన్ని ఎగదోయడం మానాలి. కాశ్మీర్‌పై వేర్పాటు వాద గ్రూపులకు సాయాన్ని నిలిపివేయాలి. కాశ్మీర్‌ ప్రజల్లో భరోసా కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా ఏవిూ సాధించలేమని గుర్తించాలి. భారత్‌ ఒక అడుగు ముందుకేస్తే పాకిస్తాన్‌ రెండడుగులు ముందుకేస్తుందన్న ఇమ్రాన్‌ తన మాటలను చేతల్లో చూపించాలి. కాశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు జిహాదిస్టు గ్రూపులు పాకిస్తాన్‌ భూ భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ఉపయోగించు కోకుండా ఇమ్రాన్‌ చూడాలి. సరిహద్దుకిరువైపులా వున్న విచ్ఛిన్నకర గ్రూపులను నిర్మూలించడంలో పాక్‌ ముందడుగు వేయాలి. ఇమ్రాన్‌ ఖాన్‌ అంతర్జాతీయ పరిణామాలను గమనించి భారత్‌తో స్నేహంగా ఉంటూ ఇరు దేశాల ప్రజల్లో విశ్వాసం కల్పించే చర్యలకు పూనుకోవాలి. మారుతున్న ప్రపంచ గమనాన్ని గుర్తించి పాక్‌ను ఉగ్రవాదరహిత దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేయాలి. ఇమ్రాన్‌ ఈ దిశగా కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభిస్తేనే ప్రపంచం గుర్తిస్తుంది. లేకుంటే గతపాలకుల మాదిరిగా అతనూ పేరులేకుండా పోవడం ఖాయం.