ఇమ్రాన్ శాంతిని కోరుకుంటున్నారు
– భారత్ ఒకడుగు ముందుకేస్తే .. రెండడుగులు వేస్తామని అన్నారు
– మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ
జయపుర, సెప్టెంబర్3(జనం సాక్షి) : పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారత్-పాక్ మధ్య శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారని మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ తెలిపారు. తాను ఇస్లామాబాద్ నుంచి తిరిగి వచ్చిన తరువాత భారత్, పాక్ మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అజ్మీర్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటన అనంతరం ఉగ్రదాడులు ఎదురైతే నా పర్యటన అనంతరం శాంతి సందేశం తీసుకొచ్చానని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారానికి హాజరైనందుకు ఎన్నో వివాదాలు తలెత్తాయని కానీ, పాక్ ప్రధాని మాత్రం తాము శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పారన్నారు. పాకిస్థాన్ పర్యటన నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ తిరిగి రాగానే కార్గిల్ వార్ జరిగిందని, ప్రస్తుత ప్రధాని మోదీ పాక్ నుంచి తిరిగి రాగానే పఠాన్‌కోట్ దాడి జరిగిందని సిద్ధు గుర్తుచేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పారని, ఇందుకోసం విూరు ఒకడుగు ముందుకేస్తే మేం రెండడుగులు వేస్తామని అన్నట్లు సిద్దూ గుర్తు చేశారు. ఆశ అత్యంత శక్తివంతమైన ఆయుధమని అసాధ్యాలను కూడా అది సుసాధ్యం చేస్తుందని చెప్పారు. నా స్నేహితుడు ఇమ్రాన్ ప్రమాణస్వీకారం అనంతరం ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గట్టిగా నమ్ముతున్నానని అన్నారు. ప్రజల మధ్య అంతరాలు తొలగించడంలో క్రీడాకారులు, కళాకారులు మందుంటారని అన్నారు. గత నెల ఆగస్టు 18న పాక్‌లో జరిగిన మాజీ క్రికెటర్, పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారానికి సిద్దూ హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలోనే పాక్ ఆర్మీ చీఫ్‌ను సిద్దూ కౌగిలించుకోడం పట్ల భాజపా నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు కూడా దీనిపై అభ్యంతరం తెలిపారు.