ఇరాన్‌ కీలక అణు శాస్త్రవేత్త మొహ్సేన్‌ హత్య

టెహ్రాన్‌ సవిూపంలో సాయుధుల దాడిలో మృతి

న్యూఢిల్లీ,నవంబర్‌28  (జనం సాక్షి):  ఇరాన్‌ అత్యంత సీనియర్‌ అణు శాస్త్రవేత్త మొహ్సేన్‌ ఫఖ్రిజాదే హత్యకు గురయ్యారు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సవిూపంలో కొందరు సాయుధులు చేసిన దాడిలో ఆయన చనిపోయినట్టు ఆ దేశ రక్షణ శాఖ ధవీకరించింది.?దమవాండ్‌ కౌంటీలోని అబ్సార్డ్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఫఖ్రిజాదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ హత్యను ఇరాన్‌ విదేశాంగ మంత్రి మొహమ్మద్‌ జావాద్‌ జరీఫ్‌ ఖండించారు. ఇరాన్‌ రహస్య అణ్వాయుధ కార్యక్రమం వెనుక ఉన్న కీలకమైన వ్యక్తి ఫఖ్రిజాదే అని పాశ్చాత్య దేశాల గూడచార సంస్థలు అనుమానిస్తూ వచ్చాయి. ‘ఇరాన్‌ అణ్వాయుధాలను ఎంచుకుంటే, ఆ బాంబుకు పితామహుడిగా ఫఖ్రిజాదే అవుతారు’ అని ఒక పశ్చిమ దేశ దౌత్యవేత్త 2014లో రాయిటర్స్‌ వార్తా సంస్థతో అన్నారు. అయితే, తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమేనని ఇరాన్‌ నొక్కి చెప్పింది. ఇరాన్‌ రక్షణ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘రక్షణ శాఖ పరిశోధన, ఆవిష్కరణల విభాగం అధిపతి మొహ్సేన్‌ ఫఖ్రిజాదే ప్రయాణిస్తున్న కారును సాయుధులైన తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. తీవ్రవాదులకు ఫఖ్రిజాదే అంగరక్షకులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ, దురదష్టవశాత్తు ఆయన్ను రక్షించేందుకు వైద్య బందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి’ అని తెలిపింది. మొదట పేలుళ్ల శబ్దం వినించిందని, ఆ తర్వాత మెషిన్‌ గన్లతో కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు ఇరాన్‌ వార్తా సంస్థ ఫార్స్‌ పేర్కొంది. ముగ్గురు నలుగురు తీవ్రవాదులు కూడా హతమయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు ఏజెన్సీ తెలిపింది. ఇరాన్‌ రక్షణ శాఖ పరిధిలోని పరిశోధన, ఆవిష్కరణల సంస్థ అధిపతిగా, ఫఖ్రిజాదే కీలక పాత్ర పోషించారు. అందుకే ‘అతని పేరును గుర్తుంచుకుంటాం’ అని బెంజమిన్‌ నెతన్యాహు రెరడేళ్ల క్రితం హెచ్చరించారు. 2015 ఇరాన్‌ అణు ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించినన ఇరాన్‌, చాలా ముందుకు వెళ్లింది. ఒప్పందంలో నిర్ధేశిరచిన స్థాయికి మించి యురేనియం స్వచ్ఛతను పెంచుకుంది. ఇజ్రాయెల్‌ ఆరోపించిన కీలక వ్యక్తి మొహ్సేన్‌ ఫఖ్రిజాదే అయితే, ఆయన హత్య ఇరాన్‌ అణు కార్యక్రమానికి బ్రేకులు వేసే ప్రయత్నం అవుతుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, ఇరాన్‌ ఒప్పందంలోకి వాషింగ్టన్‌ను తిరిగి తీసుకెళ్లడం గురించి చర్చ నడుస్తోంది. కానీ, ఫఖ్రిజాదే హత్య కారణంగా భవిష్యత్తులో జరిగే చర్చలు క్లిష్టతరమయ్యే అవకాశం ఉంది.