ఇరుపార్టీలకు తిరుగుబాట్ల బెడద

సిమ్లా,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపిలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగానే ఉంది. పార్టీ సూచించిన నాయకులకు పోటీగా పలువురు ఆయా నియోజక వర్గాల్లో నామినేషన్లు దాఖలుచేశారు. 20 మందికి పైగా కాంగ్రెస్‌, భాజపా తిరుగుబాటు నేతలు ఈ ఎన్నికల్లో స్వతంత్రులుగా నిలబడ్డారు. అక్టోబర్‌ 26 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 68 శాసనసభ నియోజకవర్గాలకు గానూ మొత్తం 479 మంది పోటీ చేస్తున్నారు. సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. దీంతో నిన్న ఒక్కరోజే 275 మంది తమ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత ప్రేమ్‌ కుమార్‌ ధుమల్‌ కూడా ఉన్నారు. టియోగ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు నామినేషన్లు వేయడం గమనార్హం. సీనియర్‌ నాయకురాలు, రాష్ట్ర మంత్రి విద్యా స్టోక్స్‌ టియోగ్‌ నుంచి బరిలోకి దిగగా.. ఇదే స్థానానికి మరో కాంగ్రెస్‌ నేత దీపక్‌ రాఠోడ్‌ కూడా నామినేషన్‌ వేశారు. అయితే విద్యా స్టోక్స్‌ మాత్రమే పార్టీ అధికారిక అభ్యర్థి అని కాంగ్రెస్‌ వెల్లడించింది.ఇక ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ సోలన్‌ జిల్లాలోని అక్రీ నుంచి ,ఆయన కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ సిమ్లా(రూరల్‌) నుంచి పోటీ చేస్తున్నారు.