ఇలా అయితే మార్చిలోగా నీరెలా ఇస్తారు?

– ఐదు గడవుల్లో ఎందుకు పనులు పూర్తికాలేదు
– అధికారుల తీరుపై మండిపడ్డ ఆర్థికశాఖ మంత్రి ఈటల
– కరీంనగర్‌ జిల్లా మిషన్‌ భగీరథ పనులపై మంత్రి అసంతృప్తి
కరీంనగర్‌, మే25(జ‌నంసాక్షి) : ఇలా అయితే మార్చి లోగా ప్రజలకు మిషన్‌ భగీరథ నీరెలా ఇస్తారు..? విూ పనితీరు మెరుగు పర్చుకోరా..? ఇంత నిర్లక్ష్యమైతే కఠిన చర్యలు తీసుకుంటా అంటూ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిషన్‌ భగీరథ పనుల తీరుపై ఈటల రాజేందర్‌ సవిూక్షించారు. ఈ సవిూక్షలో అధికారుల పనితీపై మంత్రి ఈటల
కోపోద్రిక్తులయ్యారు. ఏం పనులు చేయిస్తున్నారంటూ ప్రశ్నించారు. మార్చిలోగా నీరు ఇస్తామని చెప్పిన విూరు.. ఎందుకు పనులు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు ఇస్తామని విధించుకున్న ఐదు గడువుల్లో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పనులు పూర్తి చేస్తామని గొప్పగా చెప్పి ఆచరణలో నిర్లక్ష్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల తీరు చూస్తే మరో రెండు నెలల వరకు నీరు ఇవ్వలేరని అర్థం అవుతుందన్నారు. జులై 31లోగా నీరందిస్తాం అంటున్నారు.. నమ్మవచ్చా? అని అధికారులను మంత్రి ఈటల రాజేందర్‌ నిలదీశారు. మిషన్‌ భగీరథ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ సవిూక్షలో ఎంపీ వినోద్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సతీష్‌ కుమార్‌, బొడిగే శోభ పాల్గొన్నారు.