ఇల్లందు టిక్కెట్ కనకయ్య కోసం హస్తినలో విశ్వ ప్రయత్నాలు
ఇల్లందు టిక్కెట్ కనకయ్య కోసం హస్తినలో విశ్వ ప్రయత్నాలు
టేకులపల్లి, అక్టోబర్ 26( జనం సాక్షి ): ఇల్లందు నియోజకవర్గ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి కేటాయింపులో తారాస్థాయికి చేరి చివరకు హస్తినలో ఆశావహులు ఒకవైపు ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నాలు చేపట్టగా, మరొకవైపు కాంగ్రెస్ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇల్లందు టిక్కెట్టు ఆశిస్తున్న వారిలో పార్టీకి దరఖాస్తు చేసుకున్న వారు 32 మంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోపాటు ఆయన ముఖ్య అనుచరుడైన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య చేరిన విషయం విధితమే. ఇల్లందు టిక్కెట్టు కోరం కనకయ్యకు ఇప్పించుట కోసం పొంగులేటి హస్తిన పెద్దలతో ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదే కోరం కనకయ్యకు 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత మాజీమంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు ఢిల్లీ పెద్దలతో ముమ్మర ప్రయత్నాలు చేసి టిక్కెట్టు ఇప్పించి ఇల్లందు ఎమ్మెల్యేగా కనకయ్య గెలిచిన విషయం తెలిసిందే. ఇల్లందు టిక్కెట్ కోసం ఆనాడు రామిరెడ్డి వెంకట్రెడ్డి ఎంత శ్రమించారో, ప్రస్తుతం అదే కోరం కనకయ్య కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆనాడు ఎమ్మెల్యేగా గెలిచిన కనకయ్య కొద్ది నెలలలోనే అభివృద్ధి పేరుతో అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కనకయ్య ఓటమి చెందారు.