ఇల్లు కొంటే ఇంటి యజమాని ఉచితం

హైదరాబాద్‌ : ఇల్లు కొనుగోలు చేస్తే ఏదైనా వస్తువులు ఉచితంగా ఇస్తామనే ప్రకటనలు మనం చూసివుంటాం. అయితే ఇందుకు భిన్నంగా ఇల్లు కొనుగోలు చేస్తే ఇంటి యజమానిని కూడా వివాహం చేసుకోవచ్చనే ప్రకటన ఇండోనేషియా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులోనూ ఇంటి యజమాని మహిళ కావడంతో వార్తల్లో ప్రధానాంశంగా నిలిచింది. ఈ ప్రకటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే…
జావా ద్వీపంలోని స్లెమన్‌ నగరంలో వున్న వినాలియ అనే 40 ఏళ్ల మహిళ తన ఇల్లును అమ్మకానికి పెట్టింది. తనకు తెలిసిన రియల్‌ఎస్టేట్‌ ఏజెంట్‌కు చెప్పడంతో అతను ప్రకటనకు సంబంధించిన వివరాలను ఆమె దగ్గర తీసుకున్నాడు. వినాలియకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త కొంతకాలం క్రితం కన్నుమూశారు. దీంతో ఇల్లు కొనుగోలు చేసేవారిలో ఎవరైనా తనను పెళ్లి చేసుకుంటారేమో చూడాలని కోరింది. అయితే ఏజెంట్‌ ఏకంగా ఆన్‌లైన్‌లో ఇంటితో పాటు ఇంటి యజమాని ఉచితం అనే ప్రకటన ఇవ్వడంతో ఆమెకు రోజుకు వందలాది కాల్స్‌ వస్తున్నాయి. ఈ ప్రకటన సమాచారం పోలీసులకు కూడా సమాచారం చేరడంతో వారు కూడా ఆమె నివాసానికి వచ్చి వివరాలు తెలుసుకొని వెళ్లారు. తనను తన పిల్లలను బాగా చూసుకునే వ్యక్తిని వివాహం చేసుకునేందుకు సిద్ధంగా వున్నట్టు ఆమె పేర్కొంది. అయితే ఇల్లు మాత్రం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ ప్రకటనను చూసి వచ్చినవారిలో ఒక వ్యక్తి నిజాయితీగా వున్నట్టు వినాలియ పేర్కొంది. మిగతా వివరాలు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించింది.