ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం
తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌తోనే సాధ్యం: బిగాల
నిజామాబాద్,ఆగస్టు4(జనం సాక్షి ): కాంగ్రెస్, బిజెపి నేతలు నేలవిడిచి సాము చేస్తున్నారని, బిజెపి వాళ్లు దేశానికి ఏం చేశారో కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యంలో ఉన్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్ గుప్తా మండిపడ్డారు. దేశ అభివృద్దిని, తెలంగాణ అభివృద్దిని పోలిస్తే బిజెపి నేతల బండారం బయట పడుతుందని అన్నారు. ఇక్కడ బిజెపి అతిగా ఊహించుకుంటుందని అన్నారు. విపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే టీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్లకు టిఆర్‌ఎస్ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. విపక్షాలు చేసే పనులను బట్టే సీఎం కేసీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ నేతలకు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని అన్నారు. రాష్టంలో అధికారంలోకి రామనే అక్కసుతోనే కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ సర్కార్ ను బద్నాం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు భాష మార్చుకోవాలని ఆయన సూచించారు. సీఎంని విమర్శిస్తే పెద్దోళ్ళం అవుతామనుకుంటే పొరపాటేనన్నారు. రాష్ట్రం, రైతులు బాగుండాలని కేసీఆర్ శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ కోసమే కేసీఆర్ టిఆర్‌ఎస్ పార్టీ పెట్టి రాష్టాన్న్రి సాధించారని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు రాష్ట్రం అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని ఆయన తెలిపారు. అలాంటి వారిని కూడా సంస్కారం లేకుండా విమర్శిస్తున్నారని మండిపడ్డారు.