ఇష్టా రాజ్యంగా బోర్ల తవ్వకాలు
నష్టపోతున్న రైతులే ఎక్కువ
నల్లగొండ,మే11(జనం సాక్షి ): ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంతో సాగునీటి కోసం బోరు బావులు తవ్విస్తున్న రైతులు నీరు పడకపోవటంతో వాటిని వదిలేసి.. మరో చోట ప్రయత్నిస్తున్నారు.. నీరు పడితే.. తోడేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. భూగర్భ జలమట్టం పెంపొందించే చర్యలు మాత్రం తీసుకోవటం లేదు. అవగాహన లోపం, చైతన్యం చేసే వారు లేక రైతులు బావులు తవ్వేందుకే ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భూగర్భ జలమట్టం నానాటికీ పడిపోతున్న ప్రస్తుత తరుణంలో బోర్లు ఎండిపోతున్నాయి. వ్యవసాయం ముందుకు సాగకు అన్నదాత చతికిల పడిపోతున్నాడు. వేసిన పంటలు ఎండుముఖం పట్టి.. నేల నెర్రెలు
ఇచ్చి రైతులు తలపట్టుకొనే పరిస్థితి నెలకొంది. రైతులు జల సంరక్షణ చర్యలు చేపట్టక పోవడం ఇందుకు ప్రధాన కారణమవుతోంది. నిరంతరాయంగా విద్యుత్తు పంపిణీకి తీసుకున్న నిర్ణయంతో కొత్తగా బోర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. బోర్లతో పాటు వర్షాధారంగా పంటలు సాగు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో బోర్లన్నీ ఎండిపోయి.. అలంకారప్రాయంగా మారాయి. మరోవైపు పంటలను సంరక్షించుకునేందుకు కర్షకులు నానా పాట్లు పడుతున్నారు. బోర్లు తవ్వడమే తప్ప జల సంరక్షణ దిశగా దృష్టి సారించక పోవడంతో తరచూ
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగానే స్పందించి పొలాల వద్ద కందకాలు, ఫాం పాండ్లు ఏర్పాటు చేసుకుని నీటిని ఒడిసిపడితే సత్ఫలితాలు వచ్చేవి. ఆ దిశగా చర్యలు తగ్గాయి. భూగర్భ జలమట్టం పడిపోతున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భూగర్భ జల మట్టం పెంచేందుకు ప్రభుత్వం ఉపాధి హావిూ పథకం ద్వారా కొన్ని చోట్ల కందకాలు తవ్వించినా.. సాగు చేసే సమయంలో రైతులు వాటిని మళ్లీ పూడ్చి సాగు చేసుకుంటున్నారు. భూమిలోకి నీరు ఇంకే చర్యలు కనిపించడం లేదు. ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు లేకపోవటంతో ఇక్కడి రైతులు బోరుబావులపై ఆధారపడే పంటలు సాగు చేస్తున్నారు. వానలు తగ్గిపోవడంతో కుంటల్లో నీటిని నిల్వ చేయడం లేదు. మరి కొంత మంది రైతులు డ్రిప్‌లతో పాటు స్పిం/-రక్లర్లతో తక్కువ నీటితో ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు. మిరప తోట, స్వీట్ కార్న్, బీర్నిస్ తదితర కూరగాయలు సాగు చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల తుంపర సేద్యంతో ఆరుతడి పంటలతో మార్గదర్శకంగా నిలుస్తున్నారు.మెలకులను ఇతర రైతులు పాటిస్తూ అధిక దిగుబగులు సాధిస్తున్నారు.