ఇష్రత్ జహాన్ మా ఆడబిడ్డ
– గుజరాత్ పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్
పట్నా,ఫిబ్రవరి 12(జనంసాక్షి): ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఇష్రత్ జహాన్ ‘బిహార్ బిడ్డ’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2004 గుజరాత్ ఎన్‌కౌంటర్‌లో ఇష్రత్ జహాన్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబయి ఉగ్రదాడులపై సాక్ష్యం చెప్తున్న పాక్-అమెరికా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ తన వాంగ్మూలంలో ఇష్రత్ జహాన్ లష్కరే తోయిబా ఆత్మాహుతి దళానికి చెందిన మహిళగా వెల్లడించాడు. ఈ నేపథ్యంతో తేజ్‌ప్రతాప్ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. దీంతో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను క్షమాపణలు చెప్పాల్సిందిగా భాజపా డిమాండ్ చేస్తోంది. ఆమె ఎన్‌కౌంటర్ సమయంలోనూ నితీశ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ఆరోపించారు. దేశ భద్రతను విస్మరించి నితీశ్ ఓటు బ్యాంకు కోసం ఇష్రత్‌ను బిహార్ బిడ్డ అన్నారంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఇష్రత్‌ను బిహార్ బిడ్డగా అభివర్ణించిన వారు కనీసం డేవిడ్ హెడ్లీ వెల్లడించిన విషయాలు తెలుసుకునైనా వాస్తవాలు గ్రహించాలని భాజపా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ షానవాజ్ హుస్సేన్ హితవు పలికారు. జహాన్‌ను గుజరాత్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు పోలీసులు నకిలీ ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపిస్తున్నారు.