ఇసి పక్కాగా ఓటర్ల జాబితా రూపొందించేనా

ఓటర్ల జాబితాను తప్పులతడకగా లేకుండా నిర్వహించడంలో భారత ఎన్నికల సంఘం ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంది. ఇన్నేల్ల ప్రజాస్వామ్య చరిత్రలో సక్రమంగా ఓటర్ల జాబితాను రూపొందించిన దాఖలాలు లేవు. దీంతో ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందు ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జాబితాలో రాజకీయ పార్టీలు వేలుపెట్టేలా చేస్తున్న క్రమంలో జాబితా పక్కాగా ఉండడం లేదు. విూడియా ద్వారా లేదా నాయకుల ద్వారా ఫిర్యాదులు అందుతున్నా ఇసికి చీమకుట్టినట్లు కూడా లేదు. ఉన్నవారివి తొలగించడం, లేనివారివి జోడించడం ఎందుకు జరుగుతోందన్న దానికి సమాధానం లేదు. ఇకపోతే ఈ తప్పులతడక విధానాలు ఎప్పుడు సరిదిద్దుతారో చెప్పడం లేదు. సాంకేతికంగా ఇంతగా అభివృద్ది చెందినా ఇంకా పాత విధానాల్లోనే ఓటర్ల జాబితా రూపొందడం దారుణం. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించక ముందు నుంచి..ప్రకటించిన తరవాత ఇంకా ఓటర్ల జాబితాపై కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. ఇప్పటికే దేశంలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ పక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఎన్నికల సంఘం ఆదేవౄలతో అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ప్రతి ఒక్కరూ ఓటేయాలని ప్రజాస్వామ్య ప్రియులు పిలుపునిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు అవగాహనా శిబిరాలు నిర్వహిస్తున్నాయి. కొందరు చైతన్య కార్యక్రమాలు చేస్తున్నారు. పాలకులను ఎన్నుకునే ఓటర్లు మాత్రం జాబితాలో తమ ఓటు లేదని గగ్గోలు పెడుతున్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన యువతీ యువకులు మొదటి సారి తమ ఓటు హక్కును వేసేందుకు నమోదు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల నమోదు చేసుకున్నా రికార్డు కావడం లేదు. కొన్నిచోట్ల ఉన్న ఓట్లు గల్లంతు అయ్యాయి. ఈ దశలో ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బోగస్‌ ఓట్లతో పాటు ఓట్ల సవరణపలై ఇప్పటికే కాంగ్రెస్‌ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది. ఇదే విషయాన్ని హైదరాబాద్‌లో పరిశీలనకు వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులకు వివిధ రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మూడు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌, కమిషనర్‌ అశోక్‌ లావాసా ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం బృందం సోమవారం హైదరాబాద్‌ వచ్చింది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశ మైంది. వారి నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరించింది. ఓటర్ల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని, అభ్యంతరాలు తెలిపినా బోగస్‌ ఓట్లను తొలగించలేదని, లక్షల సంఖ్యలో అవి తుది జాబితాలోనూ కనిపిస్తున్నాయని తెలిపాయి. ఒకే ఇంటిపై పదుల సంఖ్యలో ఓట్లున్నాయి. కొన్ని ఇళ్లల్లో సంబంధంలేని వ్యక్తుల పేర్లతో ఓట్లున్నాయి. మొత్తం విూద ఓటర్ల జాబితాల్లో 68 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఓటర్ల జాబితాపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో భాగంగా ఈ నెల 31వ తేదీలోగా బోగస్‌ ఓట్లకు సంబంధించిన ఆధారాలతో కూడా అఫిడవిట్లను వేయనున్నట్లు ఎన్నికల సంఘానికి చెప్పటం తోపాటు వాటి ప్రతులనూ కాంగెస్‌ పార్టీ చూపింది. రాష్ట్రంలో ఉన్న 2.73 కోట్ల ఓటర్లలో 68లక్షల తప్పుడు, దొంగ ఓట్లు ఉన్నాయని, వీటిని సవరించకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఇంతకన్నా ద్రోహం ఉండదని ఈసీకి తెలిపినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. ఇకపోతే ఎన్నికలకు ముందే మద్యం, డబ్బు వినియోగం విచ్చలవిడిగా ఉందని, ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే పెద్ద ఎత్తున డబ్బు వినియోగ మవుతోందని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చాయి. ఒక్కో వ్యక్తి పేరుతో పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నాయని భాజపా, తెదేపా ప్రతినిధులు కూడా ఎన్నికలసంఘం బృందం దృష్టికి తెచ్చారు. సున్నితమైన

ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, ఓట్ల గల్లంతు, తప్పులను సవరించాలని కోరినట్లు తెలిపారు. మద్యం, డబ్బు వినియోగాన్ని నియంత్రించేందుకు ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా లేవని, వాటి ప్రవాహాన్ని నిరోధించటానికి ప్రతినియోజకవర్గంలో ఒక విజిలెన్స్‌ విభాగాన్ని ఏర్పాటుచేయాలని ఈసీని సీపీఐ కోరింది. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం అనూహ్యంగా పెరగనుంది.ఒక్క మలక్‌పేట నియోజకవర్గంలో 13,525 దొంగఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేయగా సవరించలేదని, కొత్త జాబితాలో 6,200 డబుల్‌ ఎంట్రీలు ఉన్నట్లు గుర్తించామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా టీవీలు, పత్రికల్లో వస్తున్న కథనాలను చెల్లింపు కథనాలుగా పరిగణనలోకి తీసుకోవాలని బీఎస్పీ కోరింది. ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులు తమకే ఓటు వేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖలు రాస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం వద్ద లబ్ధిపొందిన గుత్తేదారుల సహకారంతో తెరాస భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోందని, దీంతోనే వందసీట్లు గెలుస్తామంటూ చెబుతోందని ఈసీకి వైకాపా ఫిర్యాదు చేసింది. మొత్తంగా దొంగ ఓట్ల వ్యవహారం ఇసికి మచ్చగానే చూడాలి. పక్కాగా ఓటర్ల జాబితా నిర్వహించే విధానం అవలంబించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాన్‌కార్డు, ఆధార్‌ కార్డులా ఓటర్‌ కార్డును రూపొందించగలగాలి. అప్పుడే నిజమైన ఓటర్లు తమ ఓట్లను వినియోగించు కుంటారు. ప్రజాస్వామ్యం బలపడడానికి, మంచి ప్రభుత్వాలు ఏర్పడడానికి వీలు కలుగుతుంది.